19 August, 2026 | 5:18 PM

అక్రమ నిర్మాణాలు... అక్రమార్కుల ఇష్ట రాజ్యం...

19-08-2026 04:06 PM
  1. అనుమతులు ఒక్కటే...అంతస్తులు ఎన్నెన్నో...!!!
  2. లేఅవుట్ క్లియరెన్స్ లు సున్నా...విచ్చలవిడిగా వెంచర్లు..
  3. గృహల నిర్మాణల అనుమతితో విద్యాసంస్థల నెలకొల్పు..
  4. మున్సిపల్ నిబంధనల ఉల్లంఘన... కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు...
  5. అక్రమ నిర్మాణాల పై...అధికారుల మౌనమేల ఎందుకు...?
  6. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపెనా...?

బాన్సువాడ, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజురోజుకీ తీవ్ర రూపందాల్చుతోంది. నిబంధనలు ఉన్నా అమలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, కొందరి పెద్దల ప్రభావం, మరికొందరి “చేయి తడిపితే చాలు” అనే ఆరోపణలతో మొత్తం అనియంత్రిత నిర్మాణాలతో నిండిపోతోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అనుమతి ఒకటి –నిర్మాణం మరొకటి పట్టణ ప్రాంతాల్లో అనేక వార్డుల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల నివాస గృహం  పేరుతో అనుమతి తీసుకుని, అదే ప్రాంగణంలో బహుళ అంతస్తుల వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, నిర్మిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. రెండు అంతస్తుల అనుమతి తీసుకుని నాలుగు నుంచి ఐదు అంతస్తులు నిర్మించడం సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ శాఖ నిబంధనలు ఉల్లంఘించడం అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మౌనం ఎందుకు ఉంటున్నారని మౌనం వెనుక అసలు కారణాలు ఏమిటంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బాన్సువాడ మున్సిపల్ లో ఇదే తంతు...

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో అనుమతులు ఒకటైతే నిర్మాణాలు మరొక తిరు ఉంది. పట్టణంలోని పలు కాలనీలు జెండా గల్లీ, సాయికృపా నగర్, బొర్లం రోడ్ లో  బహిరంగ  ఉల్లంఘనలు చేస్తూ గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని,విద్యాసంస్థ కోసం నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా బహిరంగంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగావ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇది నిర్లక్ష్యమా? లేక దీని వెనుక ఏదైనా మతలబు ఉందా?” అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చలు చర్చోప చర్చలుగా సాగుతున్నాయి. లేఅవుట్ క్లియరెన్స్ లేకుండానే ఇళ్లకు అనుమతులు ఇస్తూ కొన్ని  ప్రాంతాల్లో ఉన్న  లేఅవుట్‌లకు ఇంకా ఫైనల్ క్లియరెన్స్ లేకపోయినా, అక్కడ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు జారీ కావడం అనుమానాస్పదంగా మారింది.నియమాల ప్రకారం ముందుగా లేఅవుట్‌కు పూర్తి అనుమతి రావాలి. ఆ తర్వాతే వ్యక్తిగత ప్లాట్లపై ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి. కానీ ఈ ప్రక్రియను పక్కనబెట్టి నేరుగా అనుమతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై అధికారుల విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపల్ చట్టం ఏమి చెబుతుంది...?

తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019 ప్రకారం అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధం. అనుమతికి విరుద్ధంగా నిర్మాణం చేస్తే పనులను వెంటనే నిలిపివేయాలి. అవసరమైతే అక్రమనిర్మాణాలను కూల్చివేయాలి కమర్షియల్ లేదా విద్యాసంస్థ నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. లేఅవుట్ క్లియరెన్స్ లేకుండా నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు. ఇన్ని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదనేవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మౌనం పలు అనుమానాలకు తావు ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇంత బహిరంగంగా జరుగుతున్న అక్రమాలపై చర్యలు లేకపోవడం వల్ల అధికారుల తీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు సామాన్యులకు మాత్రమే అన్న భావన కలుగుతోందనీ ప్రజలు పేర్కొంటున్నారు.

అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కు పాదం మోపెనా.?

ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి అధికారులు ఉక్కు పాదం మోపుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇంత బహిర్గతంగా అనుమతులు ఒకటైతే నిర్మాణాలు మరొకటిగా చేపడుతూ మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్న వారిపై అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.