ట్రాఫిక్ చెకింగ్‌లో చోరీ బైక్ స్వాధీనం
నిందితుడిని బాచుపల్లి క్రైమ్ టీంకు అప్పగింత
శేరిలింగంపల్లి,జూలై 27(విజయక్రాంతి): గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం హఫీజ్పేట్ లేబర్ అడ్డా సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద నిర్వహించిన సాధారణ వాహన తనిఖీల్లో చోరీకి గురైన హోండా డీలక్స్ మోట్సాకిల్ను గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు.ట్రాఫిక్ ఆర్‌ఐ జి.లవ కుమార్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్, హోంగార్డు సిబ్బంది కలిసి తనిఖీలు చేస్తుండగా అటుగా వెళ్తున్న ఆ మోట్సాకిల్ను అనుమానంతో నిలిపారు. వాహన పత్రాలు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను పరిశీలించి పోలీసు రికార్డులతో సరిపోల్చగా, ఇది బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 933/2025 చోరీ కేసుకు సంబంధించినదిగా నిర్ధారణ అయింది.
ఈ కేసు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 303(2) కింద నమోదైంది.వెంటనే ఆ మోట్సాకిల్ను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు, దానితో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకొని బాచుపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందానికి అప్పగించారు. ఘటనపై బాచుపల్లి పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.ట్రాఫిక్ పోలీసులు కేవలం ట్రాఫిక్ నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, చోరీ వాహనాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం, ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఛేదించడంలోనూ సమర్థంగా పనిచేస్తున్నారని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు తెలిపారు. ప్రతి వాహన తనిఖీ ప్రజల భద్రతతో పాటు నేరాల నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.






