ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని, అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను కోరారు. ప్రభుత్వ భూములు, చెరువులు పరిరక్షణ, కోర్టు కేసులు, కౌంటర్ల దాఖలు తదితర అంశాలపై భూపాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్, సింగరేణి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా మండలాల వారీగా ఎన్నో సంవత్సరాలుగా సాగుచేస్తున్న ప్పటికీ భూ హక్కు పత్రాలు లేని భూముల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రైతులను గుర్తించి సమగ్ర సర్వే నిర్వహించి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. భూమిని అమ్ముకోవడానికి వీలు లేకపోవడం, పంట రుణాలు, రైతు భీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలు అందకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు.
అలాంటి అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ భారతి మరియు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజమైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు అర్హులకు ఇండ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేయాలని, మిగిలిన భూములను సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనకు వినియోగించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి లైసెనస్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సర్వే అండ్ ల్యాండ్ ఏడికి సూచించారు.
సర్వే కోసం నిర్ణయించిన గడువులో పనులు పూర్తి అయ్యేలా ఆర్డీఓ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అటవీ భూముల సమస్యల పరిష్కారానికి సంయుక్త సర్వే నిర్వహించి హద్దులను ఖచ్చితంగా నిర్ణయించాలని తెలిపారు. సాగుచేస్తున్న రైతుల వివరాలను గ్రామసభల్లో వివరించాలని అభ్యంతరాలను వస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ ఏడి కుసుమ కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




