మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియ.. ఈ నెలాఖరులోగా
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా PAC సమావేశం.. మహేష్ గౌడ్ కీలక సూచనలు
నిజామాబాద్: కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh goud) కీలక సూచనలు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ( Nizamabad PAC Meeting) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత PAC సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఓటరు జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో(Armoor Constituency) ఓట్ల తొలగింపు అధికంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) అప్రమత్తంగా వ్యవహరించాలని పీసీసీ చీఫ్ హెచ్చరించారు. 2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాల వివరాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, సవరణ ప్రక్రియ సజావుగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డర్ వేశారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) కాంగ్రెస్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్న మహేశ్ గౌడ్ రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బాధ్యతని నొక్కిచెప్పారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ నాయకులు(Congress leaders) చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సమావేశంలో ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కర్, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






