పార్టీ పెట్టడం.. పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదు
- తండ్రికి గౌరవం ఇవ్వని వ్యక్తి రాజకీయంగా ఎదగలేదు
- కవితకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చురకలు
మునుగోడు/చౌటుప్పల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ‘పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదని’ కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపనపై స్పందిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెకు చురకలంటించారు. ‘కవితతో ఊదు కాలదు, పీరు లేవ’దన్నారు. బుధవారం చౌటుప్పల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబ్బులు ఉన్నాయనే కారణంతో రాజకీయ పార్టీలు స్థాపించడం సులువు కాదని, ప్రజల మద్దతు, విశ్వాసం, కృషి అవసరమని ఆయ న అన్నారు. కవిత నిర్ణయంపై విమర్శలు గుప్పి స్తూ, ఆమెకు ప్రజల్లో ఆదరణ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తండ్రికి గౌరవం ఇవ్వని వ్యక్తి రాజకీయంగా ఎదగలేరని వ్యాఖ్యానించారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. తండ్రి కి విలువ ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఎలా ఆదర్శంగా నిలుస్తారని ప్రశ్నించారు. తన అన్నపై ఉన్న అసహనాన్ని తండ్రిపై చూపడం సరైంది కాదని విమ ర్శించారు. మద్యం కుంభకోణం విషయంలో ఇప్పటికీ కవితకు పూర్తిగా క్లీన్‌చిట్ రాలేదని, ఆమె నిర్దోషిత్వం ఇంకా నిరూపించాల్సి ఉందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పేరుతో పార్టీ పెట్టడం కూడా హాస్యాస్పదమన్నారు. కవిత సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదని విమర్శించారు. ఇదిలా ఉండగా తనకు పార్టీ అధిష్టానం పెద్ద బాధ్యత ఇస్తే, ఆ పదవికి న్యాయం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






