30 April, 2026 | 5:20 AM

ఉద్యోగులకు భరోసా

30-04-2026 02:36 AM
  1. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రూ.1000 కోట్ల బకాయిల విడుదల
  2. నెలకు రూ. 700 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు
  3. అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్
  4. ఎప్పటికప్పుడు ఉద్యోగుల మెడికల్ బిల్లులను క్లియర్ చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముంద డుగు వేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ. 1000 కోట్ల నిధులను బుధవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఇచ్చిన హామీ నెరవేర్చారు.

గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ. 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను  ప్రభుత్వం అమలు చేసింది. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందుల ను స్వయంగా గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ. 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సం బంధించిన వెయ్యి కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎప్(జనరల్ ప్రావిడెంట్ ఫండ్) బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం.

ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమం లో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మెడికల్ బిల్లులు, స్కాలర్‌షిప్‌లకూ మోక్షం ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడ దని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం

ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్‌గా జరిగేలా యంత్రా ంగం చర్యలు చేపట్టింది. ‘ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు. వారి సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత’ అనే నినాదంతో ప్రభుత్వం ముం దుకు వెళ్తోంది. పెంచిన నిధులు, క్లియర్ అయిన జీపీఎఫ్ బకాయిలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని ఈ తాజా నిర్ణయం నిరూపిస్తోంది.

‘ఉద్యోగుల కష్టాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది’ని అధికారులు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.