15 March, 2026 | 12:27 AM

గరిడేపల్లిలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

14-03-2026 05:58 PM

* పకడ్బందీగా అధికారుల పర్యవేక్షణ

* నిర్భయంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గరిడేపల్లి జడ్పీ హైస్కూల్‌లో మొత్తం 130 మంది విద్యార్థులకు గాను 130 మంది హాజరయ్యారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో 107 మంది విద్యార్థులకు గాను 107 మంది పరీక్ష రాశారని మండల విద్యాధికారి (ఎంఈఓ) చత్రు నాయక్ తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మండలంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు.