30 April, 2026 | 4:05 PM

పదిలో సింగరేణి హై స్కూల్ వంద శాతం ఉత్తీర్ణత

30-04-2026 03:09 PM

అభినందించిన శ్రీరాంపూర్ జీఎం 

నస్పూర్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా పరిధిలోని శ్రీరాంపూర్ సింగరేణి హైస్కూల్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో గురు వారం జీఎం మునిగంటి శ్రీనివాస్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, 100 శాతం పాస్ పర్సెంటెజ్ కి కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా జీ ఎం మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం (2024-25)లో 98 శాతం పాస్ పర్సెంటెజ్ సాధించగా ఈసారి 100 శాతం సాధించి సింగరేణిలోనే గర్వకారణంగా నిలిచారన్నారు.

సింగరేణి వ్యాప్తంగా ఉన్న 9 పాఠశాలలో శ్రీరాంపూర్ సింగరేణి హైస్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించటమే కాక 500కు పైగా 12 మంది విద్యార్థులు మార్కులు సాధించటం హర్షణీయమన్నారు. శ్రీరాంపూర్ ఏరియా కాంట్రాక్ట్ ఉద్యోగి కూతురు B. శ్రీనిధి 559 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలవటమే కాదు మండల స్థాయిలో 3వ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 559 మార్కులతో టాపర్ గా నిలిచిన శ్రీనిధితో పాటు 549 మార్కులతో రెండవ స్థానంలో నిలిచిన మహిదర్, 526 మార్కులతో మూడవ స్థానంలో నిలిచిన నూరాన్లను జీఎంతో పాటు సింగరేణి కార్పోరేట్ జీఎం(ఎడ్యుకేషన్) వెంకటాచారిలు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటంలో కృషిచేసిన కరస్పాండెంట్ M . రాజేష్, హెడ్ మాస్టర్ B శ్రీనివాస్లతో పాటు సింగరేణి హైస్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం N సత్యనారాయణ, డీజీఎం(ఐఈడీ) రాజన్న,  సింగరేణి హైస్కూల్ కరస్పాండెంట్ (డీవై పీఎం) M రాజేష్, హెడ్ మాస్టర్ శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.