నాట్య వసుందరి శ్రీనిధి
భరతనాట్యంలో బాల ప్రతిభ
లయకు రూపం, భావాలకు భాష్యం, సంప్రదాయ కళలకు సజీవ ప్రతిరూపంగా తన నృత్య ప్రదర్శనలతో ఎనిమిదేళ్ల బాలిక శ్రీనిధి భరతనాట్యంలో ప్రత్యేక ముద్ర వేస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మం డలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన సట్ల పావని, ప్రభాకర్ దంపతుల కుమార్తె శ్రీనిధి చిన్న వయసులోనే నాట్య కళపై అపారమైన అభిరుచిని పెంపొందించుకున్నది. తన అపూర్వ నాట్య ప్రతిభతో ప్రేక్షక హృదయాలను అలరిస్తూ ‘భరతనాట్య వసుందరి’గా గుర్తింపు పొందుతోంది.
వేదికపై శ్రీనిధి అడుగులు పడితే చాలు ప్రతి కదలికలో లయ, ప్రతి భావంలో భక్తి, ప్రతి అభినయంలో కళాసౌంద ర్యం ప్రతిఫలిస్తూ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తున్నాయి. మృదువైన హావభావాలు, శాస్త్రీయ నాట్యానికి అవసరమైన ఆంగిక విన్యాసాలు, నవరసాల సమ్మేళనం ఆమె ప్రదర్శనలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
చిన్న వయసులోనే గురువులు సరోజినీ నాయుడు, సరిత ఆధ్వర్యంలో కఠిన సాధనతో భరతనాట్యంలోని సూక్ష్మాంశాలను అవగాహన చేసుకుని, గురువుల మార్గదర్శకత్వంలో కళాప్రపంచంలో మెరుగులు దిద్దుకుంటోంది. పలు సాంస్కృతిక వేదిక లు, దేవాలయ ఉత్సవాల్లో శ్రీనిధి అభినయించిన నృత్య ప్రదర్శనలు విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి.
కళా ప్రేమికుల మన్ననలు
శ్రీనిధి నాట్యంలో కేవలం వినోదం మాత్రమే కాదు భారతీయ సంస్కృతి, సం ప్రదాయం, ఆధ్యాత్మికత ప్రతిబింబిస్తుండటం విశేషం. ఆమె ప్రదర్శించే ప్రతి నృత్య రూపకం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ కళాప్రేమికుల మన్ననలు పొందుతోంది.
ఈ బాలనర్తకి ప్రతిభను గుర్తించిన కళాగురువులు, సాంస్కృతిక ప్రముఖులు భవిష్యత్తులో దేశస్థాయిలో తెలుగు నేల ప్రతిష్ఠను చాటే కళాకారిణిగా ఎదుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చిన్న వయసులోనే భరతనాట్యానికి జీవితాన్ని అంకితం చేస్తూ కళామాతకు సేవ చేస్తున్న శ్రీనిధి రాబోయే రోజుల్లో భారతీ య శాస్త్రీయ నాట్య రంగంలో ఓ ప్రకాశవంతమైన నక్షత్రంగా వెలుగొందాలని కళాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
శ్రీనిధి అందుకున్న ప్రశంసలు
* స్వర్ణగిరి దేవాలయంలో శ్రీ వాగ్దేవి విద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ మొదటి బహుమతి
* చిన్న అరుణాచలంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యం లో జూనియర్స్ మొదటి బహుమతి
* మంత్రాలయం, కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన పోటీలో జూనియర్స్ ద్వితీయ బహుమతి ప్రైజ్ మనీ
* గుడివాడ, విజయవాడలో సబ్ జూనియర్ విజేతగా బహుమతి
* తిరువనంతపురంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ పోటీలో ద్వితీయ బహుమతితో పాటు నగదు బహుమతి.
* 2024లో ‘స్వర్ణ మంజరి అవార్డు’
* ఏపీ తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో ‘నాట్య వసుందరి’ అవార్డు 2026.
బండి సంపత్ కుమార్
(మహబూబాబాద్, విజయక్రాంతి)






