వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు
వేములవాడలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం
వేములవాడ, మార్చి 27 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి.తొమ్మిదవ రోజు పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ విధానంలో అభిషేకం నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిపారు. శ్రీ సీతారాముల నవరాత్రోత్సవాల్లో భాగంగా యాగశాలలో పుణ్యాహవచనం, మూలమంత్ర హోమం, పరివార దేవతల హోమాలు నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆలయ పార్కింగ్ ప్రాంగణంలోని శివార్చన వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలతో, మామిడి ఆకులతో, అరటి తోరణాలతో అలంకరించిన వేదిక ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి కన్యాదాతలుగా మరింగంటి విజయసారథికర్ణ దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం రథోత్స వం, రాత్రి దోలోత్సవంతో ఉత్సవాలు కొనసాగాయి. కళ్యాణోత్సవం సందర్భంగా బి య్యపు గింజపై శ్రీరాముని నామం ముద్రించిన తలంబ్రాలను ఆలయ అధికారులు సిద్ధం చేయడం విశేషంగా నిలిచింది. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొ ని, వాటిని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆలయ ఈఓ రమాదేవికి అందజేశారు.
కేంద్ర మంత్రి తరఫున కూడాపట్టు వస్త్రాలు సమర్పణ..
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తరఫున కూడా పట్టు వస్త్రాలు ఆలయానికి సమర్పించబడ్డాయి. వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ పక్షాన కళ్యాణ వేడుకలలో భాగంగా వేములవాడ పుర పాలక సంఘం పక్షాన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, తదితర కౌన్సిలర్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అర్ధనారీశ్వరుడిని మనువాడిన జోగినిలు..
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జోగినీలు, హిజ్రాలు రాజన్నను మనువాడడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవా రం ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ పరమశివున్నే వరుడుగా భావించి మంగళ సూత్రం ధరించి వివాహమాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే,వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




