31 May, 2026 | 5:10 PM

ప్రశాంతంగా ముగిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం

31-05-2026 04:17 PM

భారీగా హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తజనం

జాతరలో గ్యాంబ్లింగ్ గేమింగ్

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తాండూర్ మండలం కొట్లాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈనెల 1వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రథోత్సవం, శిడే  కార్యక్రమం  భక్తి శ్రద్ధలతో జరిగింది. నెల రోజులపాటు జాతర ఉత్సవాలు కొనసాగాయి. నేడు చివరి రోజు పౌర్ణమి ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో మహిళలు, చిన్నారులు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు సహ కుటుంబ సపరివార సమేతంగా హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇదే అదనుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కొంతమంది అక్రమార్కులు గ్యాంబ్లింగ్ గేమింగ్ యదేచ్చగా నడిపించారు. ఆశకు పోయిన భక్తులు కొంతమంది తమ జేబుకు చిల్లులు వేసుకున్నారు. పోలీసులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే గ్యాంబ్లింగ్ ఆట జరిగిందని అక్కడున్నవారు అన్నారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఎలాంటి అవాయించుమియ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని గ్యాంబ్లింగ్ గేమింగ్ తమ దృష్టికి రాలేదని విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు