శ్రీరామ నామస్మరణతో మార్మోగిన సుల్తానాబాద్
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామ హృదయ కలశానికి ఘన స్వాగతం
భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన..
ఇంటింటికీ శ్రీరామ హృదయ కలశం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామివారి దివ్య సంకల్పంతోముచ్చింతల్‌లోని శ్రీరామానుజ సహస్రాబ్ది సమతా విగ్రహ క్షేత్రం నుంచి పంపిన శ్రీరామ హృదయ కలశానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం లభించింది,.సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుంచి గ్రంథాలయం, పాత జెండా చౌరస్తా, శివాలయం, మున్సిపల్ కార్యాలయ చౌరస్తా మీదుగా శ్రీరామ హృదయ కలశంతో నగర సంకీర్తన నిర్వహించారు. భక్తుల శ్రీరామ నామస్మరణ, భజనలు, భక్తి పాటలతో సుల్తానాబాద్ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి. అనంతరం శ్రీరామ హృదయ కలశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లగా మహిళలు, భక్తులు “శ్రీరామ... శ్రీరామ...” అంటూ ఐదుసార్లు శ్రీరామ నామాన్ని జపించి బియ్యం గింజలను కలశంలో సమర్పించారు.
కుటుంబ క్షేమం, సమాజ శాంతి, ప్రజల సౌభాగ్యం, ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం చిన్న జీయర్ స్వామివారు చేపట్టిన ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుల్తానాబాద్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కార్యక్రమ కన్వీనర్ సాదుల సుగుణాకర్, సునీత మాట్లాడుతూ... భక్తులు సమర్పించిన బియ్యం గింజలతో కూడిన శ్రీరామ హృదయ కలశాలను చిన్న జీయర్ స్వామివారు స్వయంగా శ్రీరామచంద్రునికి అభిషేకం చేయనున్నారనితెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, జిల్లా ప్రతినిధులు జువ్వాడి భాస్కరరావు, సుజాత,రాజు, అర్చకులు వినయ్ త్రిపాఠి, బిట్టు, కొల్లూరి జనార్ధన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, వోల్లాల రాజు, వంగల పవన్ కుమార్ , తిరుపతి రెడ్డి, భగవాన్, బండి రాము,ఎరవెల్లి శైలజ, బూరుగు సత్యంతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.






