క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం
- 10న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుందబోయిన ఎల్లయ్య
గజ్వేల్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక కోడులను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని సీఐటీయూ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు సుందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. ఈనెల 10న కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజ్వేల్‌లో మున్సిపల్ కార్మికుల సమావేశంలో కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక కోడుల పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చిందని ఆరోపించారు. పని గంటలను 12 గంటలకు పెంచడం, కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను బలహీనపరచడం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని విమర్శించారు.
నూతన విద్యుత్ చట్టం ద్వారా విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా 10న జరిగే జైల్‌భరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎల్లయ్య కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు యాదగిరి, కుమార్, పరశురాములు, నర్సింలు, స్వామి, బాబు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.






