8 August, 2026 | 6:52 PM

ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!

08-08-2026 05:25 PM

సర్కార్ రూల్స్ ప్రైవేటోళ్లకు పట్టవు!

వరుసగా 3 రోజులు హాలిడేస్ ఇచ్చినా బళ్లు నడిపిన్రూ..

బోనాలు, శని, ఆదివారాల సెలవులకూ దిక్కులేదు

ఊర్లకు పొయేటోళ్ల ప్లాన్లన్నీ తలకిందులు

తల్లిదండ్రుల ఆగ్రహం.. పట్టించుకోని విద్యాశాఖ ఆఫీసర్లు

హుస్నాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సెలవులైనా.. విద్యాశాఖ తెచ్చే రూల్సైనా తమకేం పట్టనట్లే వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. సర్కారు ఆదేశాలను లెక్క చేయకుండా తమ ఇష్టమొచ్చినట్లు బళ్లను నడుపుతూ హుకుం చలాయిస్తున్నాయి. వరుసగా రెండో శనివారం, ఆదివారం, ఆ తర్వాత బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లకు అధికారికంగా మూడు రోజులు హాలిడేస్ ఇచ్చింది.

కానీ, హుస్నాబాద్ లో ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు మాత్రం విద్యాశాఖ జీవోలను బుట్టదాఖలు చేస్తూ యథావిధిగా క్లాసులు నడిపించారు. వరుసగా మూడు రోజులు హాలిడేస్ రావడంతో బోనాల పండుగ కోసం హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని చుట్టాల ఇళ్లకు పోదామనుకున్న కుటుంబాలకు ప్రైవేటోళ్ల నిర్ణయం గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించినా.. స్కూళ్లు ఓపెన్ చేయడంతో పిల్లలను బడికి పంపక తప్పలేదు. దీంతో పండుగ పూట ఊర్లకు, బంధువుల ఇళ్లకు పోయే ప్లాన్లన్నీ తలకిందులయ్యాయని పేరెంట్స్ మండిపడుతున్నారు.

ఫీజుల దోపిడీ ఒకెత్తు.. సెలవుల వేధింపు ఇంకొకెత్తు!

ఇప్పటికే గైడ్‌లైన్స్ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్న ప్రైవేట్ స్కూళ్లు.. ఇప్పుడు పండుగ సెలవులను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ దందాను అరికట్టాల్సిన విద్యాశాఖ ఆఫీసర్లు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ సెలవులను కూడా బేఖాతరు చేస్తూ బళ్లు నడిపిన యాజమాన్యాలపై విద్యాశాఖ ఆఫీసర్లు వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.