23 March, 2026 | 2:13 AM

అచ్చమైన పల్లె రుచి.. పెద్దయ్య ఆత్మీయ వడ్డింపు!

23-03-2026 12:00 AM

రోట్లో దంచిన పొడులు.. పెరటి కూరగాయలు.

రసాయన ఆహారపు రోజుల్లో ఆత్మీయ భోజనం.. పెద్దయ్య హోటల్ ప్రత్యేకం

చారకొండ మార్చి 22: అది ఒక సామాన్యమైన ఇల్లు.. కానీ అక్కడి భోజ నం మాత్రం అసామాన్యం. 60 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ వృద్ధ దంపతులు, నేటి రసాయన ఆహారపు రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని నమ్మి ఒక అద్భుతమైన హోటల్ను నడుపుతున్నారు. నాగర్ కర్నూ లు జిల్లా చారకొండ మండల కేంద్రానికి చెందిన ఏలే పెద్దయ్య దంపతులు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పెద్దయ్య హోటల్, వారి జీవన శైలిపై ఒక ప్రత్యేక కథనం.

పెరటి పంట.. ఆరోగ్యానికి బాట. వ్యా పారం కంటే ఆరోగ్యం ముఖ్యం అని నమ్మే ఈ దంపతులు హోటల్ వెనక ఉన్న తమ చిన్న పెరట్లోనే సహజ ఎరువులతో కూరగాయలు పండిస్తారు. పురుగు మందులు లేని ఆ కూరగాయలతో వండే వంటకాలు కడుపుకు హాయిని, రుచినిస్తాయి.

సహజసిద్ధమైన మసాలాలు.!

ఇక్కడ కారం పొడులు, మసాలాలు యంత్రాల మీద తయారైనవి కావు. ఇంట్లోనే సహజ సిద్ధంగా రోట్లో దంచి తయారు చేసిన కారం పొడులనే వాడుతారు. అవిసల పొడి, మునగాకు పొడి, కాకరకాయ పొడి, కరివేపాకు పొడి, పప్పుల పొడి, ఎండుకారం పొడి, ఎలిపాయకారం పొడి.. ఇలా ప్రతి పొడిని ఒక ఔషధంలా తయారు చేస్తారు. రసాయన రంగులు, రుచి కోసం వాడే అదనపు పౌడర్లు లేకుండా చేసే ఆ వంటకాలు తింటే అమ్మ చేతి వంటను గుర్తు చేస్తాయి.

ఔషధ గుణాల పొడుల వేదిక.!

ఈ హోటల్లో దొరికే ప్రత్యేకమైన పొడులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి పొందాయి. కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిని సొంతంగా తయారు చేస్తారు.

వీటిలో కొన్ని ముఖ్యమైనవి: అవిసల పొడి & మునగాకు పొడి: గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేసే ఈ పొడులు ఇక్కడి ప్రత్యేకం.- కాకరకాయ, కరివేపాకు పొడి: చేదుగా ఉన్నా రుచిగా ఉండేలా, కరివేపాకు సువాసనతో ఉండే ఈ పొడులు కస్టమర్లను ఊరిస్తాయి.

-పప్పుల పొడి, ఎల్లిపాయకారం: ఘాటైన ఎల్లిపాయ కారం, కమ్మని పప్పుల పొడి వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఆ రుచే వేరు.

వడ్డింపులోనూ ఆత్మీయత.!

వచ్చిన ప్రతి కస్టమర్ ను ఒక అతిథిలా, ఇంట్లోని మనిషిలా ఆ పెద్దయ్య పలకరిస్తారు. భోజనానికి కూర్చున్న వారికి కేవలం వడ్డించడమే కాదు, ఏ కూర తింటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఏవి తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది వంటి చిట్కాలను చెబుతూ ప్రేమగా భోజనం పెడుతూ ఆ వంటకాల వెనకున్న విజ్ఞానాన్ని వివరిస్తారు.

నాయనా.. ఈ కరివేపాకు పొడి తింటే నీ కళ్లకు, జుట్టుకు మంచిది. ఈ మునగాకు పప్పు తింటే ఒంటికి బలం. అంటూ ప్రతి వంటకం పేరు చెబుతూ, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ ఒక తల్లిదండ్రుల్లా వడ్డిస్తారు. వ్యాపారం అంటే కేవలం లాభం మాత్రమే కాదు, ఎదుటివారి ఆరోగ్యం కూడా అని నిరూపిస్తున్నారు. ఈ చారకొండ దంపతులు. కల్తీ ఆహారం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి పెద్దయ్య హోటల్ వంటివి ఆరోగ్యానికి దేవాలయాల వంటివి. చారకొండ వైపు వెళ్లే వారు ఆ ఆత్మీయ వడ్డింపును, ఆరోగ్యకరమైన భోజనాన్ని తప్పక రుచి చూడాల్సిందే.