విద్యార్థులకు అవగతమే మన అందరి లక్ష్యం
మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యాంశాలపై పూర్తి అవగాతం కల్పిస్తేనే మన లక్ష్యం నెరవేరుతుందని ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ అన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని, ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం 35 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన విద్యా వాలంటీర్ల వ్యవస్థ విశేష ఫలితాలను అందించిందన్నారు. విద్యార్థుల హాజరు పెరగడం, అభ్యాస నైపుణ్యాలు మెరుగుపడడం, బలహీన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెరగడం వంటి సానుకూల మార్పులు కనిపించాయని పేర్కొన్నారు.
ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించి నియోజకవర్గంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో, విద్యావంతులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించి, పారదర్శకంగా ప్రత్యేక ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించారని పేర్కొన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, 100 మంది విద్యా వాలంటీర్లను ఎంపిక చేసి, వారికి సమగ్ర శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఆగస్టు 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోందని, నిష్ణాతులైన అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో బోధన పద్ధతులు, విద్యార్థుల మానసిక స్థితి అవగాహన, సబ్జెక్ట్‌పై పట్టు పెంపు, డిజిటల్ లెర్నింగ్ విధానాలు వంటి అంశాలపై విస్తృతంగా శిక్షణ అందిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం రజిత , హిమాబిందు,సురేష్,ముస్తాక్,, శ్రీనయ్య, శ్రీకాంత్, సుష్మిత, , వెంకటయ్య , శ్రీనివాస్, ఫస్సియొద్దిన్ తదితరులు ఉన్నారు.






