చాప్రాలలో మందుపానంపై నిషేధం
బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాప్రాల గ్రామంలో మందుపానాన్ని పూర్తిగా నిషేధించేందుకు గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో మద్యం సేవించడం, విక్రయించడం వల్ల కుటుంబాలు, యువతపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దూలత్ పటేల్ తెలిపారు.
గ్రామంలో మందుపానం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సాగర్ మాట్లాడుతూ.. చాప్రాల గ్రామాన్ని మందుపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విద్య, ఉపాధి, క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు.






