25 March, 2026 | 9:24 PM

ఉద్యాన నర్సరీల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

25-03-2026 07:44 PM

- ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ  ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూరు పరిధిలోని ఉద్యాన నర్సరీల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల 100 ఎకరాల తోటను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ... ఉద్యాన నర్సరీల బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రాజంపేటలో ఉద్యాన నర్సరీలను అధికారులు ఆకస్మికంగా సందర్శించాలని తెలిపారు. ఈ సంవత్సరం ఆగ్రో ఫారెస్ట్రీ, నేషనల్ బ్యాంబు (వెదురు) మిషన్ లో భాగంగా రూ.2 కోట్ల నిధులతో నర్సరీలలో మొక్కల పెంపకంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన మొక్కలను నాణ్యత ప్రమాణాలు పాటించి తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మామిడి, వెదురుతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలు పెంచడానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆయన వెంట ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.