గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా బకాయిలు చెల్లించాలి
* జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా
చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కల్లు గీత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు గీతా పనివారాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా పనివారాల సంఘం నాయకులు మాట్లాడుతూ... ప్రమాదవశాత్తు మరణించిన లేదా వికలాంగులైన గీత కార్మిక కుటుంబాలకు రావాల్సిన రూ.13 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గీతావృత్తిదారులు మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 రూపాయల లక్షలకు పెంచాలి అని పేర్కొన్నారు. మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలో వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్ ఇచ్చే పాత పద్ధతిని పునరుద్ధరించాలి అని, గీతా కార్మికులందరికీ కాటమయ్య, సేఫ్టీ కిట్లు అందించి వృత్తి పెన్షన్‌ను పెంచి స్త్రీ, పురుషులకు సమానంగా వర్తింపజేయాలని తెలిపారు.
సహకార సంఘాలకు తాటివనం, ఈత వనం పెంచడం కోసం భూములు కేటాయించాలని, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సూర్యాపేట జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పేరు పెట్టాలని, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సైదులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.




