13వ వార్డులో కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి - కౌన్సిలర్ సువార్త
జనగామ,(విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో ముందస్తు పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయని వార్డు కౌన్సిలర్ పానుగంటి సువార్త అన్నారు. శుక్రవారం వార్డు పరిధిలోని మురుగు కాలువల వద్ద పారిశుధ్య సిబ్బందితో కలిసి పనులను కౌన్సిలర్ పర్యవేక్షించారు. కాలువల పక్కన, రోడ్ల వెంట పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను గడ్డపారలతో తొలగించారు. నీరు సాఫీగా వెళ్లేలా అడ్డంకులు తొలగించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ... వర్షాలు పడితే కాలువలు పూడిపోయి ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందన్నారు. అందుకే ముందుగానే క్లీనింగ్, బ్లీచింగ్, ఫాగింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు కూడా సహకరించాలని, చెత్తను నిర్ణీత సమయంలో గుమ్మం ముందు ఉంచాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయవద్దని సువార్త కోరారు. వార్డును పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.






