పాఠశాలల్లో ఆహార నాణ్యత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు, జూన్ 30 (విజయక్రాంతి): పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జూలూరుపాడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల , కళాశాల, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించారు. ఏడో, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థినుల ఔటింగ్ రిజిస్టర్ను తనిఖీ చేసిన కలెక్టర్, బాలికలను తల్లిదండ్రులు లేదా అధికారికంగా అనుమతించిన సంరక్షకులతో మాత్రమే బయటకు పంపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. ప్లాంట్ మరమ్మతులు ఆలస్యమవుతున్న కారణాలను అడిగి తెలుసుకుని, వెంటనే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సందర్భంగా పప్పు పలుచగా ఉండటంతో పాటు నాణ్యత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులకు వడ్డించే ఆహారం పరిశుభ్రంగా, పోషక విలువలతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. తాను మళ్లీ ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆహార నాణ్యతలో లోపాలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంఈఓ జుంకీలాల్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






