భవిష్యత్తు బాగు కోసమే రాజకీయాలు చేస్తా
- ట్రిపుల్ ఐటీలో 65శాతం స్థానిక విద్యార్థులకు అవకాశం
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 30 (విజయ క్రాంతి) : చిల్లరమల్లర రాజకీయాల కోసం రాజకీయాల్లోకి తాను రాలేదని, కేవలం భవిష్యత్తు మహబూబ్‌నగర్ కోసమే రాజకీయా లకు వచ్చానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ కాలేజీ లో 65శాతం మన ఉమ్మడి మహబూబ్ నగర్ బిడ్డలే ప్రవేశాలు పొందారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ 600 కోట్లు మంజూరు చేయించుకొచ్చిన దానికంటే కూడా ఇది తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిందన్నారు.
ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన ఫలితాలు మన మహబూబ్ నగర్ విద్యార్థులు సాధించారని ఆయన చెప్పారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, విద్యా వాలంటీర్లు మరియు మేము చూపించిన ప్రత్యేక శ్రద్ధ కూడా ఒకటి అని ఆయన చెప్పారు. ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో జిల్లా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు పొందేలా ‘శతశాతం‘ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యజ్ఞంలా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, విద్యా వాలంటీర్లను నియమించి విద్యార్థులకు అదనపు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
మహబూబ్ నగర్లో 100 శాతం ఫలితాలు నమోదు కాగా, జిల్లాలో అది 94 శాతం మేరకు రావడం ఆనందకరమని, గర్వకారణమని అన్నారు. ఇది ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఫలితమని కొనియాడారు. ప్రతి విద్యార్థి ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీకి దరఖాస్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి సుమారు 33 వేల వరకు చేరిందని, గత ఏడాది 19720 మాత్రమే దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
ఇది జిల్లాలో విద్యాపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు అమలవుతూ, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని వివరిం చారు. మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, సిజే బెనహర్, జిల్లా గొర్రెల కాపరులు సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, కార్పొరేటర్ మజ్జీద్ పాల్గొన్నారు.






