15 May, 2026 | 8:58 PM

ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

15-05-2026 08:07 PM

* గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి

* అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా

* పాపన్నపేట పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాసరావు

పాపన్నపేట: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, బాధితుల సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రాత్రి వేళల్లో పహారా నిర్వహణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ తనిఖీలో డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.