అత్తమామలపై అల్లుళ్ల దాడి
- అదనపు కట్నం కోసం వేదింపులు
- ముగ్గురికి తీవ్ర గాయాలు
- సిద్దిపేట జిల్లా దిలాల్పూర్‌లో ఘటన
గజ్వేల్, మే 9 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దిలాల్పూర్ గ్రామంలో అదనపు కట్నం, కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఇద్దరు అల్లుళ్లు కలిసి అత్త, మామ, భార్యపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాచకొండ నర్సింలు, నాగమణి భార్యభర్తలకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, పెద్దమ్మాయి లలితను వడ్డేపల్లికి చెందిన శ్యాం కుమార్‌కు, చిన్నమ్మాయి అనితను వేములఘాట్‌కి చెందిన అరుణ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.
కాగా అల్లుళ్లు శ్యాం కుమార్, అరుణ్‌లు కొంతకాలంగా అదనపు కట్నం కోసం, కళ్యాణ లక్ష్మి చెక్కు డబ్బుల కోసం అత్తమామలను వేధిస్తున్నాడని బాధితులు తెలిపారు.ఈ క్రమంలో శ్యాం కుమార్, అరుణ్ ఇద్దరూ పథకం ప్రకారం నర్సింలు, నాగమణి, లలితలపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, గ్రామస్తులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు శ్యాం కుమార్, అరుణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.






