22 June, 2026 | 2:58 AM

మట్టికవి అన్నవరం దేవేందర్

22-06-2026 12:07 AM

తెలంగాణ మట్టికవి, బడుగు జీవుల కవి అన్నవరం దేవేందర్. అద్భుతమైన సాహితీ సృజనకారుడు. సమాజం లోని అట్టడుగు వర్గాల సమస్యలపై నిరంతరం స్పందించే ప్రజా కవి. వలసవా దుల ఆధిపత్యంలో తెలంగాణ భాషా సం స్కృతులు, మాండలికం చులకనవుతున్న రోజుల్లో దేవేందర్ ఈ గడ్డపై నిలబడి తెలంగాణ అస్తిత్వ జెండాను ఎత్తిపట్టారు. కర్షక, కార్మిక, దళిత, బహుజన ప్రజల గొంతై కవితలు అల్లారు. ప్రపంచీకరణ ప్రభావంతో బహుజన వర్గాలు అనుభవించిన దుఃఖాన్ని, వేదనను తన కవిత్వం లో ఆవిష్కరించారు.

కవితా ప్రక్రియలో వైవిధ్యం ఆయన ప్రత్యేకత. విలక్షణమైన శీర్షికలు, గాఢత కలిగిన కవితా వస్తువులు ఆయన సొంతం. ప్రజల పక్షపాతిగా నిలిచిన అన్నవరం దేవేందర్ సాహితీ సేవలు నిరుపమానమైనవి. దేవేందర్ పుట్టి పెరిగిన నేపథ్యమంతా పల్లెటూరు, వ్యవసా య క్షేత్రాలు. తన బాల్యమంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా(ఇప్పటి జగిత్యాల జిల్లా)లోని పోతారంలోనే గడిచింది. అందు వల్లనే ఆయనకు పల్లెలంటే ఆయనకంత మమకారం. గ్రామీణ ప్రజలపై ఆయనకు ఎనలేని అనురాగం.

పల్లెల్లోని కష్టజీవుల బాధలను గమనించడం, వారి జీవనాన్ని అక్షరీకరించడం ఆయన చిన్నప్పుడే అలవాటు చేసుకున్నారు. వివిధ కులవృత్తులు చేసుకొనే బహుజనులను నిత్యం పరిశీలిస్తుండేవారు. అందుకే తన తొలి కవితాసంపుటి ‘తొవ్వ’లో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కవితలుగా మలిచారు. ఆ తర్వాత ‘నడక’, ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’ మొదలైన 14 కవితా సంపుటాలను వెలువరించారు. దేవేందర్ ఏ అం శాన్నైనా కవితలుగా మలచగలరు.

ఇంటిలోని చిన్నపాప ఏడుపు నుంచి అంతర్జా తీయ స్థాయి అంశాల వరకు.. అలవోకగా కవితగా మలిచి సమాజానికి చూపిం చగలరు. ఆయన జర్నలిస్టుగా పనిచేస్తు న్న కాలం నుంచే సమాజంలోని సమస్యలను ప్రత్యక్షంగా గమనించడం అలవా టు చేసుకున్నారు. చిన్నప్పుడు తన తాత య్య చెప్పిన కథలను ఒంటపట్టించుకున్నారు. పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ వార్తాపత్రికలు, వారపత్రికలు చదువుతూ అందులోని కథలపై, కవితలపై ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆ ప్రభావమే ఆయన హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వివిధ సాహిత్య సభలకు, విప్లవ రచయితల సంఘం (విరసం) సభలకు వెళ్లేలా చేసింది.

ఆ విధంగా కవితలు రాయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. విప్లవ కవితలతో ప్రభావితమై అనేక సామాజిక సమస్యలను తన కవితా సంపుటాలలో కవితలుగా పొందుపరిచారు. కరువుతో విలవిలలాడుతూ వ్యవ సాయం చేసుకునేందుకు నీళ్లులేక విదేశాలకు వలసవెళ్లిన వారి బాధలను వర్ణిం చారు. అప్పులు ఎక్కువై వరిబస్తాలకు కట్టే తాళ్లే ఉరిశిక్ష తాళ్లుగా మార్చి ఆత్మహత్యలు చేసుకున్న వ్యథలను రాశారు. చేనే త కార్మికులు పురుగుమందులు తాగ డం, మగ్గాలకి ఉరిపోసుకొని చాలించిన తనువుల గోసలను తన కవనాలలో వర్ణించిన తీరు కన్నీటిని తెప్పిస్తుంది. ప్రపంచీకరణ ప్రపంచ అభివద్ధిని పెం పొందించిందో లేదో కానీ పేదప్రజల నోళ్లను మాత్రం కొట్టిందని ఆయన ఖచ్చితంగా చెప్పారు.

విమర్శనాత్మక ధోరణి

దేవేందర్ ఒక్కో కవితపై ఒక్కో విమర్శనాత్మక వ్యాసాన్ని లిఖించవచ్చని చెప్పడం లో సందేహం లేదు. ప్రజల బాధలను పక్కన పెట్టి సమాజపక్షం కోసం కనీస సిరాను విదిల్చకుండా పేర్లకోసం వెంపర్లాడే కవులను తన కవితలలో నిలదీశా రు. కద్దరు బట్టలు తొడగడమే కాదు కన్నీటితో పంటలను పండిస్తున్న రైతుల జీవితాలను తడిమి చూడండని చెప్పారు. ఇలాంటి సందర్భాలు అనేకంగా ఆయన కవితలలో కనిపిస్తాయి. తెలంగాణ ప్రాం తాన్ని వలసవాదులు.. ఎలా అన్యాయం గా దోచుకొని నీళ్లను, నిధులను, నియామకాలను ఏవిధంగా కాజేశారో కుండ బద్దలు కొట్టినట్టు తన కవితలలో వినిపించారు. దేవేందర్ పోతారం నుంచి నగరానికి వచ్చినా పల్లెమట్టి కోసమే ఇప్పటికీ అనుక్షణం ఆరాటపడుతున్నారు.

తెలంగాణ పండుగలను, సంస్కతి ని, ఆచారాలను, కట్టు, బొట్టును తడిమారు. ఇలా తెలంగాణ ప్రాంతీయ దృక్ప థంతో అనేక కవితలను వెలువరించారు. ఆయన కవితలన్నీ వైవిధ్యంగానే ఉంటా యి. ఒక్కో కవితకు ఒక్కో విభిన్నమైన శీర్షిక నిర్ణయిస్తారు. ఆ శీర్షికలు చూస్తేనే పాఠకునికి కవితను సాంతం చదివేయాలని అనిపిస్తుంది. ప్రత్యేకమైన కవితావ స్తువులతో, వైవిధ్యమైన శీర్షికలతో, చక్క ని శిల్పము, గాఢతలతో ఆయన కవితలు కొనసాగుతాయి.

‘తొవ్వ’ నుంచి మొదలుకొని ‘అట్లనే’ అనే కవితా సంపుటి వర కు ఉన్న ఆయన కవితలన్నింటినీ గమనిస్తే విప్లవ భావాలతో ప్రభావితుడైనట్టు కనిపిస్తారు. ప్రజల పక్షాన నిలిచారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి పట్ల ఆరాధకుడుగా, దళిత బహుజనుల గళమై నిలిచారు. ప్రజలకోసం నేటికీ తన కవితలతో నిత్యం పోరాటం చేస్తున్నారు. నిరంతరం ప్రజాపక్షాన నిలిచే దేవేందర్ ఈనెల ౨౮న కరీంనగర్‌లో ‘నలిమెల బుచ్చమ్మ - రామచంద్రం’ తొలి స్మారక పురస్కారాన్ని అందుకోబోతున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

 సెల్ : 95053 91696