సాంస్కృతిక వారధి ఒగ్గు కథ
తెలంగాణ మట్టికి ఒక పరిమళం ఉంది. ఆ పరిమళంలో చెమట చుక్కల సుగంధం ఉంటుంది. ఆ చెమటలో కష్టం ఉంటుంది. ఆ కష్టంలో జీవితం ఉంటుంది. ఆ జీవితాన్ని గానం చేస్తూ, గాథగా చెబుతూ, తరతరాల చరిత్రను మోస్తూ వచ్చిన మహోన్నత జానపద కళారూపమే ఒగ్గు కథ. ఇది కేవలం ఒక కళ కాదు. తెలంగాణ ఆత్మకు అద్దం. ఒక జాతి జ్ఞాపకాల భాండాగారం. ఒక సమాజం తన విశ్వాసాలను, తన వలాలను, తన సంస్కతిని భవిష్యత్తుకు అందించే సజీవ వారసత్వం. డోలు మోగినప్పుడు అది కేవలం శబ్దం కాదు. తెలంగాణ గుండెచప్పుడు. ఒగ్గు గాయకుడి గొంతు వినిపించినప్పుడు అది కేవలం కథ కాదు. శతాబ్దాల చరిత్ర పలికే స్వరం.
పద్మశ్రీ చుక్కా సత్తయ్య పేరు వినగానే ఒగ్గు కథ గుర్తుకొస్తుంది. నిరక్షరాస్యుడైన ఆయన తన అసా ధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. తెలంగాణ ఒగ్గు కథా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. అక్షరాస్యత, వరకట్న నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలను ఒగ్గు కథలోకి తీసుకువచ్చి సరికొత్త ఒరవడి సృష్టించారు. కళను ప్రజా చైతన్య వేదికగా మలిచిన మహనీయుడు ఆయన. అలాగే, ఒగ్గు కథకు మిద్దె రాములు కూడా ఆధునిక ఆకర్షణను జోడించి అద్భుత కళాకారుడిగా నిలిచా డు.
తన గంభీర స్వరం, ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎంతో మంది స్కాలర్స్ ఒగ్గు కథపై పరిశోధనలు చేశారంటే, ఒగ్గు కథ మన సంస్కృతిలో ఎంతలా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. తమ జీవితాలను ఒగ్గు కథ కోసం వెచ్చించిన ఈ అచ్చమైన తెలంగాణ కళాకారుల గొప్పతనం ఎల్లప్పుడూ కొనియాడదగినది.
గ్రామాల్లో పండుగ వాతావరణం
ఒకప్పుడు తెలంగాణ ప్రాంత పల్లెల్లో ఒగ్గు కథ అంటే ఒక పండుగ. గుడి ప్రాంగణంలోనో, ఊరి రచ్చబండ దగ్గరో, పెద్ద చెట్టు నీడలోనే కథ ఉందంటే చాలు, గ్రామం మొత్తం అక్కడికి చేరేది. చిన్నారులు తల్లిదండ్రుల చేతులు పట్టుకుని వచ్చేవారు. పెద్దలు తట్టు సంచులు, గొంగళ్ళు వేసుకుని కూర్చునేవారు. చలికాలపు చలిగాలులు ఎముకలు కొరికినా, తెల్లవారుజామున కోడి కూసే వరకు ఎవరూ లేచి వెళ్లేవారు కాదు. డోలు ‘ఢమ్...ఢమ్’ అంటూ మోగగానే ఊరు ఒక్కసారిగా మేల్కొనేది. కథకుడి గళంలో వినిపించే బీరప్ప గాథలు, మల్లన్న మహిమలు, ఎల్లమ్మ త్యాగాలు ప్రజలను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లేవి. కళాకారుడు ఏడిస్తే ప్రేక్షకుల కళ్లూ తడిసేవి. అతను నవ్విస్తే ఊరంతా నవ్వులతో మార్మోగేది.
కథను వారు కేవలం వినేవారు కాదు. ఆ పాత్రలతో కలిసి జీవించేవారు. శివుని చేతిలోని పవిత్ర ఢమరుకాన్ని తెలంగాణ జానపద భాషలో “ఒగ్గు” అని పిలుస్తారు. అదే పేరు ఈ కళారూపానికి శాశ్వత గుర్తింపుగా మారింది. గొల్ల, కురుమ సమాజాల జీవన విధానంతో ముడిపడిన ఈ కళ, వారి కులదైవాలైన బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ గాథలను ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేసింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల, కురుమలతో పాటు ఇతర కులాలకు చెందిన భక్తులు కూడా మల్లన్న పట్నాలు వేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. అందువల్ల ఒగ్గు కథ చెప్పించుకోవడం ఒక సంప్రదాయంగా, భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.
కళాకారుల గానంలో జీవితం
ఒగ్గు కథ కేవలం వినోదం కాదు. అది ఒక సమాజ చరిత్ర. ఒక జాతి విశ్వాసాల గ్రంథం. పుస్తకాలు అందుబాటులో లేని కాలంలో, ఈ కళాకారులే ప్రజలకు చరిత్రను, సంస్కతిని, ధర్మాన్ని, జీవన తత్వాన్ని చేరవేసిన సజీవ విశ్వవిద్యాలయాలు. ఒగ్గు కథ ప్రత్యేకత దాని సమగ్రతలో ఉంది. ఇందులో సంగీతం ఉంది. నత్యం ఉంది. నాటకం ఉంది. కవిత్వం ఉంది. అభినయం ఉంది. ప్రధాన కథకుడు ఒక్క క్షణంలో భక్తుడిగా కనిపిస్తాడు. మరో క్షణంలో వీరుడిగా మారిపోతాడు. మరికొన్ని క్షణాల్లో దేవుడిగా, దైవ దూతగా, సాధా రణ మనిషిగా రూపాంతరం చెందుతాడు. అతని గళం నవరసాలను పలికిస్తుంది. కళ్లలో భావాలు ప్రవహిస్తాయి. అడుగుల్లో చరిత్ర నర్తిస్తుంది.
డోలు, తాళాలు, కంజీరా, ఒగ్గు వాయి ద్యాల సమ్మేళనం ప్రేక్షకుల హదయాలను కదిలిస్తుంది. అందుకే ఒగ్గు కథను చూడటం ఒక ప్రదర్శనను చూడటం కాదు. ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని ఆస్వాదించడం. ఈ కళను తెలంగాణ పల్లెల నుంచి ప్రపంచ వేదికల వరకు తీసుకువెళ్లిన మహనీయుల సేవలు చిరస్మరణీయమైనవి. మల్లికార్జున్ (ఒగ్గు రవి) వంటి యువ కళాకారులు నేడు ప్యారిస్, లండన్ వంటి అంతర్జాతీయ వేదికలపై డోలు మోతను వినిపిస్తూ ఈ కళ వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. గోలి కనకయ్య, ఎర్ర మల్లయ్య వంటి కళాకారులు గ్రామీణ ప్రాంతా ల్లో ఒగ్గు కథ ప్రాచుర్యం కోల్పోకుండా నిరంతరం పల్లెల్లో ప్రదర్శనలు ఇస్తూ వందలాది మంది శిష్యులను తయారుచేశారు.
కళ కోస మే తమ జీవితాలను అంకితం చేసిన ధన్యజీవులు వీరు. మల్లారి వంటి కళాకారులు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ కళామాత సేవలోనే తరిస్తూ, ఒగ్గు కథలోని పౌరాణిక శైలి, ప్రాచీన రూపం దెబ్బతినకుండా కంటికి రెప్పలా కాపాడారు. ఈ మహనీయులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పేరుప్రఖ్యా తులు ఆశించకుండా, కళనే ప్రాణంగా భావించి జీవించిన అనేక మంది ఒగ్గు కళాకారులు తమ జీవితాలను కళామాత సేవకు అంకితం చేశారు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే, తరతరాలుగా ఒగ్గు కథ సంప్రదాయాన్ని కంటికి రెప్పలా కాపాడూతూ ఈ జానపద కళా జ్యోతిని వెలిగిస్తున్నారు. అయితే కాలం మారిం ది. ఒకప్పుడు పల్లె జీవితానికి కేంద్రబిందువుగా ఉన్న ఒగ్గు కథ, నేడు మనుగడ కోసం పోరాడుతోంది. టెలివిజన్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఓటీటీ వేదికలు ప్రజల వినోదపు అలవాట్లను పూర్తిగా మార్చేశాయి.
అమ్దానీ లేని కళ
ఒకప్పుడు కళాకారుడి చుట్టూ గుమిగూడిన జనాలు, నేడు మొబైల్ స్క్రీన్లలో మునిగిపోతున్నారు. ప్రదర్శనల సంఖ్య అమాంతం తగ్గింది. కళాకారులకు ఆదాయం తగ్గింది. యువతలో ఆసక్తి తగ్గింది. కళాకారుల జీవితాల్లో ఆర్థిక అస్థిరత పెరిగింది. ఫలితంగా కొత్త తరాలు ఈ కళను వృత్తిగా ఎంచుకునేందుకు వెనుకాడుతున్నాయి. ఇది కేవలం ఒక కళారూపానికి వచ్చిన సంక్షోభం కాదు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ఎదురైన సవాలు. ప్రభుత్వాలు కళాకా రులకు గౌరవ వేతనాలు, శిక్షణా కేంద్రాలు, స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. పాఠశాల ల పాఠ్యాంశాల్లో జానపద కళలకు స్థానం కల్పించాలి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించాలి.
డిజిటల్ వేదికల ద్వారా ఒగ్గు కథను ప్రపంచవ్యాప్తంగా చేరవేయాలి. అంతకంటే ముఖ్యంగా, మనం ఈ కళను ప్రేమిం చాలి. వాటిని నేటితరం పిల్లలకు పరిచయం చేయాలి. ఒక ప్రదర్శన జరిగినప్పుడు వెళ్లి చూ డాలి. ఎందుకంటే కళాకారుడికి చప్పట్లు కూడా ఒక బహుమతే. ఒగ్గు కథను కాపాడుకోవడం అంటే ఒక కళను రక్షించడం మాత్రమే కాదు. మన వలాలను కాపాడుకోవడం. మన పూర్వీకుల జ్ఞాపకాలను నిలబెట్టడం. తెలంగాణ అస్తి త్వాన్ని భావితరాలకు అందించడం. ఒక జాతి సంస్కృతిని సజీవంగా ఉంచడం. ఈ రోజు ఒ గ్గు కథ మౌనంగా మారితే, రేపు మన చరిత్రలో ఒక అధ్యాయం మూతపడుతుంది.
డోలు దెబ్బ ఆగిపోతే, తెలంగాణ గుండెచప్పుడు మూగబోతుంది. అందుకే ప్రతి తెలంగాణ బిడ్డ తన హయాంలో ఒక డోలు మోతను దాచుకోవాలి. ప్రతి ఇంట్లో ఒకసారైనా ఒగ్గు గానం సాగాలి. తెలంగాణ గుండెల్లో డోలు మోగినంత కాలం, ఒగ్గు గాయకుడి గొంతు వినిపించినంత కాలం ఈ గడ్డ ఆత్మ సజీవంగానే ఉంటుంది. ఒగ్గు కథ బతికితే ఒక కళ మాత్రమే కాదు. ఒక తరం జ్ఞాపకాలు, ఒక సమాజ సంస్కృతి, ఒక నేల అస్తిత్వం, ఒక జాతి ఆత్మగౌరవం బతికినట్లే. ఆ డోలు దెబ్బను మన గుండె చప్పుడుగా మార్చుకుందాం. ఒగ్గు కథను కాపాడుకుందాం. తెలం గాణ ఆత్మను నిలబెట్టుకుందాం.
సెల్: 9010128884






