మూడు దశాబ్దాల ప్రజాసేవకు అంతర్జాతీయ పట్టాభిషేకం
- పుదుచ్చేరి వేదికపై సంతోష్ కుమార్‌కు గౌరవ డాక్టరేట్
తాండూరు,(విజయక్రాంతి): మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన అభినవ కల్చరల్ సోషల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, లైక్ టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా మేనేజ్మెంట్ సభ్యులు కేశెట్టి సంతోష్ కుమార్ (అభినవ సంతోష్ కుమార్) కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. శనివారం పుదుచ్చేరిలోని కంబన్ కలైయరంగం ఆడిటోరియంలో నిర్వహించిన సామాజిక నాయకులు - దార్శనికుల సమ్మేళనం - 2026 కార్యక్రమంలో ఆయనకు సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ డైరెక్టర్, తమిళనాడు మాజీ న్యాయమూర్తి డాక్టర్ కె. వెంకటేశన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఆర్. శంపత్, ప్రపంచ శాంతి సంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి, ప్రపంచ బౌద్ధ సమాఖ్య అధ్యక్షులు రాయబారి డాక్టర్ పర్విందర్ సింగ్, అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ పి. అమృతవల్లి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమిషనర్ డాక్టర్ కె. సుకుమార, చెన్నై మద్రాస్ హైకోర్టు మధ్యవర్తి డాక్టర్ ఎస్. సిద్ధార్థన్, గౌరవ అతిథులుగా కెనడాకు చెందిన న్యాయవాది కాలీసిస్ టెలెష్, అంతర్జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి చైర్మన్ డాక్టర్ సందీప్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు మాజీ సహాయ న్యాయమూర్తి డాక్టర్ హరిదాస్, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హిందీ సలహా కమిటీ సభ్యులు, యూనివర్సిటీ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు చితిరాల, కర్ణాటక భారతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, యూనివర్సిటీ సంయుక్త డైరెక్టర్ డాక్టర్ ఎం. రామచంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రజల కష్టాల్లో అండగా... సేవలో ముందంజగా...
కేశెట్టి సంతోష్ కుమార్ 30 ఏండ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు 98 సార్లు రక్తదానం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా ఉత్తమ రక్త దాత అవార్డ్ తీసుకున్నారు. పేదలకు సహాయ కార్యక్రమాలు, విద్యార్థులకు ప్రోత్సాహం, పేద,ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యా సహాయం, వైద్య శిబిరాలు, ఉచిత వైద్య సహాయం, మహిళా సాధికారత, యువతలో సేవా దృక్పథం పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అవగాహన, ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అంబలి, మజ్జిగ, మంచినీటి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పేదలు, వృద్ధులు, నిరుపేదలకు అన్నదానం, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రజలకు అండగా నిలిచి ఆహారం, నిత్యావసర సరుకులు, ఇతర అత్యవసర సహాయాలను అందించారు. 17 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి సంవత్సరం హరిత గణపతులు (మక్కా మట్టితో చేసిన మట్టి గణపతులు మొక్కలు ) ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తూ అన్నదానం, వైద్య సహాయం, రక్తదానం, విద్యా సహాయం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్‌పై డాక్టర్ కేశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ గౌరవం తన ఒక్కరి విజయం కాదని అభినవ సంస్థ సభ్యులు, సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు, అధికారులు, అనధికారులు, మీడియా మిత్రులు, పాత్రికేయులు, తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సహకారం, ఆశీస్సుల ఫలితమేనన్నారు.






