ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ 121వ జయంతిని పురస్కరించుకుని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ఖేలేగా భారత్ - జీతేగా భారత్’ అనే నినాదంతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ సునీత మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 29న భారతదేశ ప్రముఖ హాకీ క్రీడాకారుడు, హాకీ మాంత్రికుడిగా ప్రసిద్ధి గాంచిన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
విద్యార్థులకు నిత్యజీవితంలో క్రీడలు, శారీరక వ్యాయామాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అరుందా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని వివరించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వహీదా, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






