29 August, 2026 | 7:39 PM

విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ నిరసన

29-08-2026 06:30 PM

సీఎం దిష్టిబొమ్మ దహనం.. అడ్డుకున్న పోలీసులు

తీవ్ర ఉద్రిక్తత.. బిజెపి నేతల అరెస్ట్

కరీంనగర్,(విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించగా, అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వలయాలను దాటుకుని ముందుకు వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల చేయాలని, విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలన్నారు. సమస్య పరిష్కారమయ్యే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తి లేదని  హెచ్చరించారు. విద్యార్థులకు బిజెపి అండగా ఉంటుందని , బకాయిలు విడుదల చేసే వరకు  పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.