భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం
భిక్కనూర్, మార్చి 20(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్, బ్యూటీ అండ్ వెల్నెస్ ల్యాబ్‌లను మండల విద్యాధికారి రాజగంగారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్‌లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠ్యపుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా ప్రాయోగిక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్, బ్యూటీ అండ్ వెల్నెస్ కోర్సులపై తరగతులతో పాటు ప్రాక్టికల్ శిక్షణ కూడా అందించనున్నట్లు చెప్పారు.
ఈ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించి, వారి ప్రతిభను వెలికితీయడానికి ఈ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే ఈ ల్యాబ్‌ల ద్వారా ప్రాక్టికల్ జ్ఞానం పెంపొందించి, విద్యార్థులను స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల వైపు దారితీసేలా మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భవాని, పీఆర్‌టీయూ సంఘ నాయకులు శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




