3 July, 2026 | 12:57 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు అధికారుల కసరత్తు

03-07-2026 11:57 AM

క్షేత్రస్థాయిలో పరిశీలన

షాద్‌నగర్ జూలై 3 (విజయక్రాంతి): పట్టణంలోని ప్రధాన చౌరస్తా విస్తరణ అంశంపై అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. చౌరస్తా విస్తరణ ఉద్యమకారుడు ఆర్.ఎన్. రాము విజ్ఞప్తి మేరకు నిర్వహించిన ఈ పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీవో సరిత, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, సీఐ సీతారాం, తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ టీపీఓ పావని, ఆర్ అండ్ బీ శాఖ ఏఈ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్డీవో సరిత మాట్లాడుతూ, చౌరస్తా విస్తరణలో భాగంగా ఉన్న విగ్రహాలను తరలించేందుకు ముందుగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి తీర్మానం చేయాలని సూచించారు. అనంతరం విగ్రహాలను మరో అనువైన ప్రదేశానికి తరలించి రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు పూర్తి కాగానే విస్తరణ పనులకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని శాఖల అనుమతులు, రాజకీయ పార్టీల సమ్మతితో విగ్రహాల తరలింపు ప్రక్రియ పూర్తి చేసి, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వాటిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆ తర్వాత ఆర్ అండ్ బీ అధికారులు రోడ్డు మార్కింగ్ చేపట్టి, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా విస్తరణ పనులు నిర్వహించాలని అన్నారు.

రోడ్డు విస్తరణ ఉద్యమకారుడు ఆర్.ఎన్. రాము మాట్లాడుతూ, ప్రభుత్వ గెజిట్ ప్రకారం చౌరస్తా వద్ద 300 అడుగుల రోడ్డు విస్తరణకు అనుమతి ఉందని, కనీసం 200 అడుగుల మేర విస్తరణ చేపట్టాలని అధికారులను కోరారు. దీనిపై స్పందించిన అధికారులు, ప్రభుత్వ ఉత్తర్వులు, గెజిట్ వివరాలను పరిశీలించిన అనంతరం ఎంత మేరకు రోడ్డు విస్తరణ చేపట్టాలనే విషయాన్ని త్వరలో ప్రకటించి, అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో షాద్‌నగర్ ప్రధాన చౌరస్తా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.