24 July, 2026 | 2:38 AM

పని జరగాలంటే.. పైసా ఇవ్వాల్సిందే..

24-07-2026 12:42 AM

నంగునూరు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి జాడలు 

పట్టించుకోని అధికారులు

విజిలెన్స్ దృష్టి.... అయినా మారని అధికారుల తీరు

నంగునూరు, జూలై 23: ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజలకు సేవలు అందాల్సిన చోటు.కానీ, సిద్దిపేట జిల్లా నంగునూరు మండల రెవెన్యూ కార్యాలయంలో మాత్రం అవినీతి జాడలు రాజ్యమేలుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే సామాన్యు లను ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ఆదాయం, కులం, స్థానిక, ఫ్యామిలీ మెంబర్ తదితర సర్టిఫికెట్ల కోసం వెళ్లిన ప్రతి ఒక్కరి దగ్గరా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అడిగినంత  ఇవ్వాల్సిందే..

భూముల క్రయ విక్రయాలలో రెవెన్యూ అధికారులు,సిబ్బంది అడిగింత ఇవ్వాల్సిందేనని పలువురు ఆరోపిస్తున్నారు.పౌతి రిజిస్ట్రేషన్తో పాటు సాధారణ రిజిస్ట్రేషన్లకు సైతం అనేక కొర్రీలు పెడుతూ డబ్బులు దండుకుంటున్నారనీ రైతులు మండిపడుతున్నారు.ప్రతి పనికి కొర్రీలు పెట్టీ పెండింగ్ పెట్టడం,బేరం కుదిరాక పని పూర్తి చేయడం ఇక్కడ మామూలే అంటూ అన్ని వర్గాలలో చర్చించుకుంటున్నారు.

కార్యాలయంలోని కొందరు అధికారులు, సిబ్బంది డబ్బులు వసూలు చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వేలువడుతున్నాయి. పారదర్శకంగా పనులు చేస్తామని పైకి నీతులు చెప్పే అధికారులు,తెరవెనుక మాత్రం వసూళ్ల పర్వంలో బిజీగా ఉంటున్నారనీ తోటి ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

బేరం కుదిరితే.. ఫోన్ పే!

అవినీతిని కప్పిపుచ్చేందుకు రెవెన్యూ సిబ్బంది కొత్త టెక్నిక్ వాడుతున్నారు. తమ పేరిట కాకుండా బంధువులు, స్నేహితుల యూపీఐ ఐడీలు,ఫోన్పే నంబర్లకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాల నుంచి అన్ని రకాల సేవలకూ ఇదే తంతు కొనసాగుతోందనీ బాధితులు చెబుతున్నారు. ఇక పైసలు ఇవ్వనిదే కొంత మంది జీపీవో ల వద్ద పని జరగదు అనే మాట మండలంలో అన్ని గ్రామాల్లోనీ ప్రజలు నిర్భయంగా చెబుతున్నారు. డబ్బులు ఉంటేనే పని జరుగుతుంది అని డైరెక్ట్ గా సూచిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.ఇటీవల ఒక బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ధ్రువీకరణ పత్రం కోసం వెళ్లగా, అధికారుల చుట్టూ తిప్పుకొని చివరకు రూ.2వేలు వసూలు చేశాక పత్రాన్ని అందజేశారనీ సదరు లీడర్ వాపోయారు.ఓ జీపీవో రైతు ఫౌతి రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా రూ.70వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఇచ్చిన సమాచారం.

పట్టింపు ఏది?

కార్యాలయంలో ఇంత జరుగుతున్నా పై స్థాయి అధికారుల్లో స్పందన కరువైంది.నంగునూరు రెవెన్యూ కార్యాలయంపై విజిలెన్స్ అధికారుల దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. గతంలో విజిలెన్స్ దాడులు జరిగినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి, అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు

కార్యాలయంలో ప్రతి పనికి సిబ్బంది ఇష్టానుసారంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే అంశం పై నంగునూరు తహసిల్దార్ ప్రవీణ్ రెడ్డిని వివరణ కోరగా ఈ విషయం నా దృష్టికి ఇంతవరకు రాలేదు అని తెలిపారు.సిబ్బంది డబ్బులు అడుగుతే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.వివిధ పనుల కోసం వచ్చే వారు సిబ్బందికి డబ్బులు ఇవ్వకూడదు కార్యాలయంలో అవినీతిపై విచారణ జరిపి నిరూపితమైతే  సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. కార్యాలయంలో అవినీతికి తావు లేదు,ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం

- ప్రవీణ్‌రెడ్డి, తహసిల్దార్ నంగునూరు