23 June, 2026 | 3:35 PM

శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం

23-06-2026 02:03 PM

భాజపా మండలాధ్యక్షులు తిప్పర్తి నికేష్

మానకొండూరు, జూన్ 23 (విజయక్రాంతి): గన్నేరువరం మండల కేంద్రంలో భాజపా మండలాధ్యక్షులు తిప్పర్తి నీకేష్ ఆధ్వర్యంలో, మంగళవారం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలి దివస్ సందర్భంగా ముఖర్జీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా, నికేష్ మాట్లాడుతూ, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది, విద్యావేత్త, దేశ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని ఆయన సేవలను కొనియాడారు.

"ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండవు" అనే దృఢ సంకల్పంతో జమ్మూ-కాశ్మీర్ సంపూర్ణ విలీనానికి ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో చిరాస్మరణీయమన్నారు. దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం ,భారత మాత గౌరవం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.1953 జూన్ 23న దేశ సమైక్యత కోసం పోరాడుతూ ఆయన చేసిన పరమ త్యాగం భారత జాతి ఎప్పటికీ మరువలేనిదిని, ఆయన ఆశయాలు, దేశభక్తి, సేవా తత్వం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.

సీనియర్ నాయకులు అటికం రామచంద్రం, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మచ్చ బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శులు పుల్లెల రాము, బొమ్మాడి సురేందర్ రెడ్డి, గన్నేరువరం 8వ వార్డు సభ్యులు మచ్చ సాయికృష్ణ, మండల నాయకులు సందవేణి ప్రశాంత్, కుర్ర హరీష్ తదితరులు బలి దివస్ కార్యక్రమానికి హాజరయ్యారు.