మతసామరస్యాన్ని చాటుతూ
- లౌకిక విలువలను కాపాడుకుందాం..
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
పాల్వంచ, మార్చి 3,(విజయక్రాంతి): మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు పండుగలు దోహదపడతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని జామ మసీదులో ఇఫ్తార్ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ప్రత్యేక నమాజు అనంతరం ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ రంజాన్ మాసంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతాభావం పెంచుతున్నాయని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సమాజంలో శాంతిని నెలకొల్పుతుందని, ప్రజల, కులాలు, మతాల మధ్య గద్వేషాలను దూరం చేస్తుందన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టిన కఠినమైన ఉపవాస దీక్షలు వారి కుటుంబాలతో పాటు సమాజంలో శాంతిని, ప్రేమను నెలకొల్పడానికి, సోదర భావం, దాతృత్వాన్ని పెంచడానికి దోహదపడుతుందని, ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకతీతంగా మతసామరస్యాన్ని చాటి చెబుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ముస్లిం మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.




