3 May, 2026 | 5:51 PM

వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం

03-05-2026 04:50 PM

- నిబంధనలపై అవగాహన ఉండాలి

- మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా

కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లాలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్న తరుణంలో, వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యండీ. యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా అందే ఈ పరిహారం పొందాలంటే కొన్ని కీలక నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

వడదెబ్బతో వ్యక్తి మరణించిన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని, మరణించిన రోజున వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని  వాతావరణ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు. చనిపోయిన బాధితుని ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, వారసుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్

వివరాలతో స్థానిక తహసీల్దార్  కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో  విచారణ చేసి  నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపడం జరుగుతుందని అనంతరం కలెక్టర్ ఆమోదంతో నేరుగా నామినీ ఖాతాలో నగదు జమ అవుతుందని వివరించారు. గతంలో ఈ పరిహారం 50,000 లు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దీన్ని 4 లక్షలకు పెంచడం జరిగిందని, అర్హులైన ఏ ఒక్కరూ సమాచార లోపం వల్ల నష్టపోకుండా ఈ పథకంపై క్షేత్రస్థాయిలో అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ పథకం పట్ల వివరాలకై 8520860785 నంబరుకు సంప్రదించాలని తెలిపారు.