11 May, 2026 | 5:15 AM

పంచాయతీ కార్యదర్శుల కొరత

11-05-2026 02:28 AM

జనగామ, మే 10 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల పాలనలో కీలకపాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శుల కొరత మండలంలో వేధిస్తోంది. గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ పథకాల అమలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి.

అయితే పంచాయతీ కార్యాలయాల్లో అవసర మైన స్థాయిలో నియమకాలు జరుగక పోవడంతో గ్రామాలలో పాలన సక్రమంగా సాగడం లేదని ప్రజలు వాపోతున్నారు. తరిగొప్పుల మండలంలో 15 పంచాయతీలకు గాను సచివాలయాలు ఏర్పాటు చేసి, కార్యదర్శులను నియమించారు. వీటిలో, తరిగొప్పుల, బొత్తలపర్రె, పోతారం, అక్కరాజుపల్లి, బొంతగట్టు నాగారం, అబ్దుల్ నాగారం గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులను నియమించలేదు.

ఇనచార్జులతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. తరిగొప్పుల మండల కేంద్రంలో సుమారు నెల రోజుల నుండి పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి లేకపోవడం వల్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మానసింగ్ తండా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి మెడికల్ లీవ్లో ఉండగా ఇనచార్జ్ బాధ్యతలను కొత్త తండా పంచాయతీ కార్యదర్శి సాయి రంగారెడ్డి కు అప్పగించారు. అక్కరాజుపల్లి పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శి డిప్యూటేషన పై వెళ్లగా, పోతారం కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న తిరుమల్ రెడ్డి కి ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించారు. బొంతగట్టునాగారం, పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండడంతో బొత్తలపర్రె, పంచాయతీ కార్యదర్శి శశి కుమార్ కు ఇనఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

అదే విధంగా అబ్దుల్ నాగారం పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండడంతో అంక్సాపూర్, పంచాయతీ కార్యదర్శి భూక్య లింగం కు ఇనచార్జ్ బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా చిల్పూర్ మండలం కిష్టాది గూడెం, పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండడంతో వంగలపల్లి, పంచాయతీ కార్యదర్శి మమత కు ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దేశాయి తండా పంచాయతీ కార్యదర్శి పోస్టు  ఖాళీగా ఉండటంతో రాజవరం కార్యదర్శి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

అదేవిధంగా లింగంపల్లి పంచాయతీ కార్యదర్శి ఖాళీగా ఉండటం వల్ల మల్కాపూర్, కార్యదర్శి మహేందర్ కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఒక్కొక్క కార్యదర్శి తను పనిచేస్తున్న పంచాయతీతో పాటు అదనంగా మరో పంచాయతీ బాధ్యతలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా పంచాయతీల్లో ప్రభుత్వ పథకాల అమలు ఆలస్యం కావడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయా పంచాయతీల ప్రజలు వాపోతున్నారు. ఇటీవల ఆన్లైన్ విధానం, డిజిటల్ నమోదు ప్రక్రియ పెరగడంతో కార్యదర్శులపై సాంకేతిక ఒత్తిడి పెరిగింది. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ వ్యవస్థ బలప డాలంటే కార్యదర్శుల కొరతను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయా గ్రామప్రజలు కోరుతున్నారు.

ఈ విషయంపై తరిగొప్పుల ఎంపీడీఓ ఇంచార్జ్ దేవేందర్ రెడ్డి ను వివరణ కోరగా మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత వాస్తవమేనని తెలిపారు. ఈ విషయాన్ని డీపీఓ వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తరిగొప్పుల మండలం బొంత గట్టు నాగారంలో పంచాయతీ కార్యదర్శి లేక గత నెల రోజుల నుండి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని. సరైన సమయానికి పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పంచాయతీ కార్యదర్శి నియమించాలని కోరారు.