17 April, 2026 | 2:32 AM

పిల్లలు కావాలంటే నీ భార్యను పంపు

17-04-2026 12:32 AM

నాసిక్ టీసీఎస్ బాధితుడి వాంగ్మూలం

కంపెనీ కొత్త నిర్ణయం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం

ముంబై, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పిల్లలు కావాలంటే తన భార్యను వారి దగ్గరకు పంపాలని, తనతో నమాజ్ కూడా చేయించారని ఓ బాధితుడు పోలీసులు ముందు వాంగ్మూలం ఇచ్చాడు. టీసీఎస్ వేధింపుల కేసులో బాధిత ఉద్యోగి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. హిందూ దేవుళ్ల ఉనికిని ప్రశ్నిస్తూ ఎగతాళి చేసేవారని, మహారాష్ట్రకు చెందిన మహనీయుల గురించి కించపర్చేలామాట్లాడేవారని బాధితుడు ఆరోపించాడు. ఇస్లాంలో చేరాలని నిందితులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ వేధింపులు 2022లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కొనసాగుతున్నాయని వాపోయాడు. టీమ్ లీడర్ తౌసిఫ్ అక్తర్, సహోద్యోగి డానిష్ షేక్ తనను లక్ష్యంగా చేసుకున్నారని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ రుద్రాక్ష మాల ధరిస్తారని, దానిని చూసి వారు తరచూ ఎగతాళి చేసేవారన్నాడు. వీరి ఆగడాలపై 9 మంది ఉద్యోగులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 78 అనుమానిత కాల్ రికార్డులను, చాటింగ్‌లను కనుగొన్నారు.

వేధింపులు సమర్థించం: టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్..

ఈ ఘటనపై టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనల్ని తాము సమర్థించబోమన్నారు. నిందితుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హారతి సుబ్రహ్మణ్యం ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. వాస్తవాలను తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏప్రిల్ 18న నాసిక్ కేంద్రంలో పర్యటించనుంది.