రోడ్డు వెంట చెక్.. నదిలో వెళ్తే నో చెక్?
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు మారుతున్న మార్గాలు
డీలర్లు పాత్రపై అనుమానాలు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘాపై ప్రశ్నలు
కౌటాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులకు ఆదాయ వనరుగా మారుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రోడ్డు మార్గంతో పాటు నది మార్గాన్ని కూడా అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారన్న ప్రచారం అధికారులని ఘాపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపు బియ్యం తరలింపులో రోడ్డు మార్గం ఒకవైపు.. నది మార్గం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహదారులపై వాహనాల తనిఖీలు జరిగే అవకాశం ఉండటంతో నది మార్గాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డీలర్ల పాత్రపై అనుమానాలు..
రేషన్ బియ్యం సరఫరా వ్యవస్థలో రేషన్ డీలర్ల పాత్ర కీలకం. లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థపై ఉంది. అయి తే కొందరు డీలర్ల వద్ద నుంచే బియ్యం బ యటకు వెళ్తుందా? మధ్యవర్తుల చేతుల్లోకి చేరుతున్న బియ్యం చివరకు మహారాష్ట్ర సరిహద్దు దాటి వెళ్తుందా? అనే ప్రశ్నలు తలె త్తుతున్నాయి. బియ్యం ఎక్కడి నుంచి వస్తోం ది.. ఎవరి చేతికి చేరుతోంది.. ఎక్కడ నిల్వ చేస్తున్నారు.. చివరకు ఏ మార్గంలో సరిహద్దు దాటుతోంది అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా ఎక్కడ?
అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఎ న్ఫోర్స్మెంట్ అధికారులు, సంబంధిత శాఖల పర్యవేక్షణపైనా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రోడ్డు మార్గంలో తనిఖీలు ఉన్నప్పటికీ.. నది మార్గంలో నిఘా ఎంతవరకు ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నది మార్గంలో పడవల ద్వారా బియ్యం తరలింపుపై సమాచా రం ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు కనిపించడం లేదన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న సరఫరా గొలుసును ఛేదించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
డీలర్ నుంచి సరిహద్దు దాటే వరకు..
డీలర్ స్థాయిలోనే జరుగుతోందా..? మధ్యవర్తులు ఎవరు?రవాణా చేసే వాహనాలు, పడవలు ఎవరివి?నది మార్గంలో బియ్యం తరలింపును ఎవరు పర్యవేక్షిస్తున్నారు?ఎన్ఫోర్స్మెంట్కు సమాచారం ఉన్నా చర్యలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదల కోసం కేటాయించిన బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, డీలర్ స్థాయి నుంచి సరిహద్దు వరకు మొత్తం వ్యవస్థపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బియ్యం తరలించే వారిని పట్టుకుంటున్నాము. రేషన్ బియ్యం, ముఖ్యంగా సన్న బియ్యం అక్రమంగా తరలించే వారి సమాచారం అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
పెద్ది రాజు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, కౌటాల






