3 September, 2026 | 3:15 AM

నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్

03-09-2026 | 12:02am
  1. కీసర మాజీ సబ్ రిజిస్ట్రార్ అరెస్టు
  2. 100 కోట్ల విలువచేసే ఆస్తులకు నకిలీ పత్రాల సృష్టి!

మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసిన కేసులో కీసరలో గతంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన మహమ్మద్ యూసఫ్ రెహెమాన్‌ను(Mohammad Yusuf Rahman) పోలీసులు అరెస్టు చేశారు. కీసర ఎస్‌ఆర్‌గా రెహమాన్ 2016 నుంచి 8 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో నకిలీ డాక్యుమెం ట్లతో రిజిస్ట్రేషన్లు చేసే ముఠాలతో చేతులు కలిపారు.

ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు కబ్జా చేసే వారికే కాకుండా, నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులు హౌసింగ్ రుణ సంస్థలతో రుణాలు ఇప్పిస్తున్న ముఠాలతో కూడా చేతులు కలిపారు. వల్లభనేని శ్రీనివాస రావు అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారి పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి బ్యాంకు హౌసింగ్ ఫైనాన్స్‌ల నుంచి రుణాలు ఇప్పించాడు. వారు ఈఎంఐ సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో ఈ భాగోతం బయటపడింది. తొమ్మిది గృహాలపై రూ.4.11 కోట్లు రుణం పొందినట్టు తేలింది. పరారీలో ఉన్న తొమ్మిదవ నిందితుడు సబ్ రిజిస్ట్రార్ రెహెమాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.