11 April, 2026 | 4:11 AM

మహిళా భద్రతకు షీ నేత్ర టీమ్స్

11-04-2026 01:49 AM

రహస్య కెమెరాలపై కఠిన చర్యలు

అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందజేసిన సీపీ సజ్జనర్

ఖైరతాబాద్, ఏప్రిల్10(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత, గోప్యత పరిరక్షణకు పోలీస్ శాఖ మరొక ముందడుగు వేసింది. రహస్య కెమెరాల ద్వారా జరుగుతున్న గోప్యత ఉల్లంఘనలను అరికట్టేందుకు ‘షీ నేత్ర టీమ్స్’ పేరిట ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్లు పనిచేయనున్నాయి. ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగంపై, తనిఖీల సమయంలో పాటించాల్సిన ప్రమాణాలపై రెండు దశల్లో సమగ్ర శిక్షణ ఇచ్చారు. బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఈ టీమ్లకు కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపింగ్ మాల్స్, ట్రయల్ రూమ్స్, హోటళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులు వంటి ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్య కెమెరాల ఏర్పాటును కఠినంగా అరికట్టనున్నట్లు స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహస్య కెమెరాలు కనుగొనబడితే సంబంధిత సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే బ్లాక్లిస్ట్ చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతి సంస్థ తమ ప్రాంగణాల్లో భద్ర తా ప్రమాణాలు పాటించే బాధ్యతను నిర్వర్తించాల్సి ఉందని, ‘కస్టమర్ సేఫ్టీ ఇన్చార్జ్’ను తప్పనిసరిగా నియమించుకోవాలని సూచించారు. ఈ ఇన్చార్జ్లు షీ టీమ్స్తో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మహిళల భద్రత సామూహిక బాధ్యత అని పేర్కొ న్న పోలీసులు, అనుమానాస్పద పరికరాలు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ హెల్ప్లైన్ 9490616555కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా భద్రతా విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.