డీడీఎన్ అర్చక సంఘం జిల్లా అధ్యక్షునిగా చక్రధరాచార్యులు
మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ దీప దూప నైవేద్య అర్చక సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అనంతాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని అనంతాద్రి దేవస్థానంలో నిర్వహించిన జిల్లా డీడీఎన్ అర్చకుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న డీడీఎన్ అర్చకులు సమావేశానికి హాజరై వేతనాల సమస్యలు, దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం, ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గొడవర్తి చక్రధరాచార్యులు మాట్లాడుతూ, జిల్లాలోని డీడీఎన్ అర్చకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి అర్చకుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేస్తానని, ప్రతి అర్చకుడికి సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు..నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ గొడవర్తి చక్రధరాచార్యులను సమావేశంలో పాల్గొన్న అర్చకులు, పలువురు ప్రముఖులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.






