18 April, 2026 | 3:06 PM

బీజేపీ కపటనీతి బట్టబయలు చేశాం

18-04-2026 01:37 PM

చట్టవిరుద్ధంగా డీలిమిటేషన్‌ బిల్లును తేవడానికి బీజేపీ చేసిన కుట్ర భగ్నం 

షాద్ నగర్ ఎమ్మెల్యే 'వీర్లపల్లి శంకర్

షాద్ నగర్,(విజయక్రాంతి): 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోతుందని,  ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రతిపక్షాల విజయమని షాద్ నగర్ ఎమ్మెల్యే 'వీర్లపల్లి శంకర్" అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మహిళా బిల్లును అడ్డుపెట్టుకొని డిలిమిటేషన్ బిల్ ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్యను ప్రజాశక్తులు అడ్డుకున్నాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. 

శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తులు ఏకమైతే ఎలాంటి దురుద్దేశపు చట్టాలనైనా అడ్డుకోవచ్చని ఈ పరిణామం రుజువు చేసిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలనే చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వానికి లేదని శంకర్ అన్నారు. ఫలితంగానే పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్‌ చేసిందని చెప్పారు. సంపన్నులే కాకుండా సామాన్య మహిళలు రాజకీయాల్లోకి రావాలనేదే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమన్నారు. కానీ, తమ డిమాండ్లను పట్టించుకోకుండా కేంద్రం మొండిగా వ్యవహరించిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ బిల్లులు తెరపైకి తెచ్చిందన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు డీలిమిటేషన్‌ అంశాన్ని జోడించి బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేసిందని శంకర్ ఆరోపించారు. పార్లమెంటులో నిన్నటి పరిణామాలు బీజేపీ కపటనీతిని బట్ట బయలుచేశాయన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని శంకర్ డిమాండ్‌ చేశారు. కాగా, లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య రాజ్యాంగ విజయమని  తెలిపారు. చట్టవిరుద్ధంగా డీ లిమిటేషన్‌ బిల్లును తేవడానికి బీజేపీ చేసిన కుట్రలను కాంగ్రెస్‌ అడ్డుకుందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెంచుకొని రాజకీయ లబ్ధి పొందడానికి వేసిన ఎత్తుగడ దెబ్బతిన్నదని, బీజేపీ ప్రభుత్వ నియంత పోకడలకు అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా కులగణన చేసిన తర్వాత చట్ట సవరణ చేయాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ నెగ్గిందన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లు అమలు కోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ పి రఘునాయక్, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కొత్తూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, లింగారెడ్డిగూడెం ఉపసర్పంచ్ ఏరోళ్ల అశోక్, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ముబారక్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.