షాబాద్ హంతకుడి ఆత్మహత్య!
- రంగారెడ్డి కొత్తూరు మండలం పెంజర్లలో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం
- హత్యలకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో
రంగారెడ్డి/షాద్‌నగర్, జూలై 13 (విజయక్రాంతి): ఒకే రాత్రి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు, భార్యాపిల్లలను కలిపి మొత్తం ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులోని ఓ వెంచర్ వద్ద సోమవారం రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమయ్యింది.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన రాజ్‌కుమార్.. ఆ కక్షతో షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో మూడు రోజుల క్రితం ఒకే రాత్రి ఘోరానికి ఒడిగట్టాడు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్న రాజ్‌కుమార్.. చివరికి కొత్తూరు మండలంలోని తన మేనమామ ఊరైన పెంజర్ల గ్రామ శివారుకు చేరుకుని, ఒక వెంచర్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం కావడంతో విషం తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
నమ్మించి ముంచారు..
మృతదేహం వద్ద లభ్యమైన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ధృవీకరించారు. జూలై 10న సాయంత్రం 4:55 గంటల సమయంలో రాజ్‌కుమార్ ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ‘నా సంపాదనలో సగానికిపైగా ఆ అమ్మాయి కుటుంబం కోసమే ఖర్చు పెట్టాను. నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని నన్ను ఘోరంగా మోసం చేశారు.
ఆ అమ్మాయిని నమ్మి నేను పూర్తిగా అప్పుల పాలయ్యా ను. ఆఖరికి నా కన్నపిల్లలకు కనీసం బొమ్మలు కూడా కొనివ్వలేని స్థితికి దిగజారిపోయాను. ఇంట్లో ఉన్న వస్తువులు, ల్యాప్‌టాప్‌ను కూడా అమ్మేసి కోర్టు కేసుల ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చుకున్నాను. నేను చనిపోతే నా పిల్లలు ఇబ్బంది పడతారని భావించాను’ అని ఆ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.
కాల్చి చంపాల్సింది సార్: రాజ్‌కుమార్ అన్న
బాధితులను ఎంత క్రూరంగా హింసించి చంపాడో, అతన్ని కూడా అంతే దారుణమైన చంపాలని, ప్రశాంతంగా చచ్చాడు.. కాల్చి చంపాల్సింది సార్ అని రాజ్‌కుమార్ అన్న ఆవేదన వెల్లగక్కాడు. ‘మా జీవితాలన్నీ నాశనం చేశాడు. పిల్లలు ఏమన్నార్రా.. నేనన్న పెంచుకుంటుంటి. వాళ్లు సచ్చినట్టే వీడు సచ్చేదుండే. ఇంత మూర్ఖుడని కలలో కూడా ఊహించలేదు’ అని అంటూనే బోరున విలపించాడు.
మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకుల నిరాకరణ
చేవెళ్ల(విజయక్రాంతి): పోలీసులు రాజ్‌కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి పోస్టుమార్టం పూర్తవగా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో బందోబస్తూ మధ్య పోలీసులే రాత్రి 10 గంటల తర్వాత చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
మేఘనకు 10లక్షల ఆర్థిక సాయం
షాబాద్ ఘటనలో అనాథగా మిగిలిపోయిన బాలిక అక్క మేఘనకు అండగా ఉంటామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ తరుణ్ జోషితో కలిసి రూ.10 లక్షల చెక్కు అందజేశారు. మేఘన పరిస్థితి తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లుతో పాటు మానసిక వికాసం కోసం సికింద్రాబాద్ పునరావాస కేంద్రంలో చేర్పిస్తామని చెప్పారు.






