2 September, 2026 | 1:59 PM

సురక్ష ఏజెన్సీ సూపర్వైజర్ లైంగిక వేధింపులు

02-09-2026 | 01:14pm

భరించలేక బయటపెట్టిన బాధితురాలు

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు

గజ్వేల్‎లో విలేకరుల సమావేశంలో వెల్లడించిన బాధితురాలు

సూపర్వైజర్ బండి రమేష్ లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు

గజ్వేల్,సెప్టెంబర్ 1(విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లోనే తనకు రక్షణ లేకుండా పోయిందంటూ ఓ మహిళా సెక్యూరిటీ గార్డు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి(Siddipet Government Hospital)లో గత ఏడేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ మహిళ సురక్ష ఏజెన్సీ సూపర్‌వైజర్‌(Suraksha Agency Supervisor) బండి రమేష్‌ తనను పలుమార్లు లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించారని ఆమె పేర్కొన్నారు.

తనకు జరిగిన అన్యాయంపై ఎవరిని ఆశ్రయించాలో తెలియక కొంతకాలంగా తీవ్ర ఆవేదనకు గురైనట్లు బాధితురాలు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని కూడా ఆమె ఆరోపించారు. చివరకు సిద్దిపేట జిల్లా(Siddipet District) బీసీ సంఘం నాయకులను ఆశ్రయించగా, వారు తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు.దీంతో గజ్వేల్ పట్టణంలో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు తనకు ఎదురైనట్లు చెబుతున్న ఘటనలను వెల్లడించారు.

తనపై జరిగినట్లు ఆరోపిస్తున్న లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలపై సదరు సూపర్‌వైజర్‌ వివరణ, పోలీసుల దర్యాప్తు వివరాలు వెల్లడికావాల్సి ఉంది.