గోదావరిఖనిలో ఏసీపీ రమేష్ నేతృత్వంలో ఆపరేషన్ చబుత్రా
అర్ధరాత్రి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం
30మంది యువకులు అరెస్ట్, వాహనాలు సీజ్
రెండు బెల్ట్ షాపులపై కేసులు
గోదావరిఖని, సెప్టెంబర్ 2(విజయ క్రాంతి): రాత్రి వేళల్లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై రామగుండం పోలీస్ కమిషనరేట్(Ramagundam Police Commissionerate) ప్రత్యేక దృష్టి సారించింది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి భారీ ఎత్తున ‘ఆపరేషన్ చబుత్రా’నిర్వహించారు.
ఏసీపీ ఎం.రమేష్(ACP M. Ramesh) స్వయంగా పోలీసు బృందాలను సమన్వయం చేస్తూ, ప్రధాన కూడళ్లు, రహదారులు, వీధులు, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బైక్‌లపై పెట్రోలింగ్ నిర్వహించి, గుంపులుగా తిరుగుతున్న యువకులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో 30మంది యువకులను వారి ద్విచక్ర వాహనాలు అదుపులోకి తీసుకుని, డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk driving) పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెట్టీ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే రెండు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ..ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం,రాత్రి వేళల్లో నేరాలు,అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ‘ఆపరేషన్ చబుత్రా’ ప్రధాన లక్ష్యమన్నారు. గంజాయి వినియోగం, విక్రయాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, బెల్ట్ షాపులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల కేంద్రాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాత్రి 10గంటల తర్వాత రోడ్లపై విన్యాసాలు చేస్తూ, గుంపులుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రమేష్ హెచ్చరించారు.అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. పట్టుబడిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఏసీపీ రమేష్ సూచించారు.ప్రజలు ఎక్కడైనా అసాంఘిక లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రతే లక్ష్యంగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిరంతర పెట్రోలింగ్(Patrolling), నైట్ చెకింగ్‌లు(Night checks) నిర్వహిస్తూ పటిష్టమైన పోలీసింగ్ అందిస్తామని ఏసీపీ ఎం. రమేష్ స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్‌లో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐలు మనోహర్, సంధ్య, వెంకటస్వామితో పాటు పోలీస్ స్టేషన్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.






