15 August, 2026 | 4:32 AM

మీ జోక్యమెందుకు?

15-08-2026 02:20 AM

వివాదం నాకు, విద్యార్థులకు మధ్యనే.. ‘బీసీఐ’కేం సంబంధం? 

తప్పు చేసినా.. విద్యార్థులకు తమ అభిప్రాయాన్ని ప్రకటించే హక్కు ఉంది

నల్సార్ లా వర్సిటీ వివాదంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౪: హైదరాబాద్ నల్సార్ లా వర్సిటీ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జోక్యం అనవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సీరి యస్ అయ్యారు. విద్యార్థులే తప్పు చేసి నా, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే లా నిరసన తెలిపే భావప్రకటనా హక్కు వాళ్లకు ఉందని స్పష్టం చేశారు.

ఈ అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలతోపాటు విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి పిటిషన్‌పై విచారణలో సీజేఐ వైఖరి సరిగా లేదని, స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా అంగీకరించలేమని, సీజేఐ చేతుల మీదుగా పట్టా అందుకోవడం తమకు ఇష్టం లేదని వర్సిటీ విద్యార్థులు ఇటీవల యాజమాన్యానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) స్పందించింది.

వర్సిటీకి చెందిన 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ‘ఈ నిరసన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? నిర్వహించారు? లేదా సమీకరించారు? అనేదానిపై వైస్ ఛాన్స్‌లర్ (వీసీ) నుంచి వాస్తవ నివేదికను సమర్పించాలి’ అని వర్సిటీ యాజమాన్యానికి అందిన ఉత్తర్వుల్లో ఉంది.

ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని, కొందరు లేఖ రాసినందుకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం అన్యాయమనే అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మొత్తంగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ నిలిపివేయాలనే ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో, దానిపై వివరణ ఇవ్వాలని సీజేఐ ఈమేరకు బీసీఐకి నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు, తనకు సంబంధించిన విషయంలో బీసీఐ ఎందుకు తలదూరుస్తున్నదని మందలించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని నొక్కిచెప్పారు.

నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవితను ప్రశ్నార్థకం చేసే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని బీసీఐకి హితవు పలికారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడూ స్వయంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. శాంతియుతంగా తమ గళం వినిపిస్తున్న విద్యార్థులను అందుకు అనుమతించాలని సూచించారు. నల్సార్ విద్యార్దులు కావాలంటే సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోనూ లాయర్లుగా నమోదు చేసుకోవచ్చని సీజేఐ సూచించారు.  నల్సార్ వర్సిటీ లా విద్యార్థులపై సీజేపీ ఉద్యమ ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

బీసీఐ నిర్ణయం ఏకపక్షం: ఎస్‌కేబీఏ అధ్యక్షుడు వికాస్‌సింగ్

సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌కేబీఏ) అధ్యక్షుడు, సీనియర్ అడ్వొకేట్ వికాస్‌సింగ్ స్పందిస్తూ.. బీసీఐ తీసుకున్న నిర్ణయం ‘ఏకపక్షమని, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్న లా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు బీసీ యత్నిస్తున్నదని విమర్శించారు. విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛాపూరిత ఆలోచనలకు, చర్చలకు వేదికలుగా ఉండాలని, కేవలం అసమ్మతి తెలిపినంత మాత్రాన విద్యార్థులను న్యాయ వృత్తిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేశారు.

విద్యార్థుల హక్కులే ముఖ్యం: బీసీఐ చైర్మన్ మానవ్ మిశ్రా

బీసీఐ జారీ చేసిన సర్క్యులర్‌పై చైర్మన్ మానన్ మిశ్రా స్పందించారు. విద్యార్థుల ప్రయోజనాలను, హక్కులను కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. తొందరపాటులోనే ఒక సర్క్యులర్ జారీ చేశామని, విషయం తమ దృష్టికి వచ్చిన తర్వాత, 40 నిమిషాల్లోనే పొరపాటును సరిదిద్దుకున్నామని తెలిపారు. అభిజిత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. తమ లక్ష్యం విద్యార్థుల హక్కులను కాపాడటమేనని వెల్లడించారు.

లీగల్ కాక్రోచెస్ ఏకమవుతాయి: సీజేపీ

బీసీఐ సర్క్యులర్‌పై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘దేశంలో న్యాయవాద బొద్దింకలన్నీ (లీగల్ కాక్రోచెస్) ఒక్కటైతే ఏమవుతుందో తెలుసా?’ అంటూ ప్రశ్నించారు. విద్యార్థుల నిరసన హక్కుపై కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని, అందుకు బీసీఐ చైర్మన్ మానవ్ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.