7 April, 2026 | 4:02 AM

9 మంది పోలీసులకు ఉరిశిక్ష

07-04-2026 02:12 AM
  1. తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో సంచలనం
  2. కీలకంగా మారిన మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం
  3. కేసులో ౧౦౦ మంది సాక్షుల విచారణ
  4. అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన మదురై కోర్టు
  5. నేరం రుజువు కావడంతో దోషులకు గరిష్ఠ శిక్ష విధింపు
  6. దోషులు మొత్తం ౧౦ మంది కాగా, విచారణ సమయంలోనే ఒకరు మృతి

చెన్నై, ఏప్రిల్ 6: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతాన్‌కుళం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరంతో ప్రమేయం ఉన్న మొత్తం తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసు అని అభివర్ణిస్తూ, దోషులకు గరిష్ఠ శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాలు.. అది కొవిడ్ సంక్షోభ సమయం. భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన కాలం. తేదీ 2020 జూన్ 19. ప్రభుత్వం అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాపు నడిపారన్న ఆరోపణలతో యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సాతాన్‌కుళం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు తీవ్రంగా హింసించారు. దీంతో తండ్రీకొడుకులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారు ఇదే నెల ౨౩న మృతిచెందారు. పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే వల్లే వారు చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపించారు. చనిపోయేందుకు కారణం తీవ్రమైన రక్తస్రావమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ దారుణంపై అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదిక ప్రకారం.. ఇద్దరి మృతదేహాలపై కలిపి 18 తీవ్రమైన గాయాల గుర్తింపు జరిగింది. ముగ్గురు వైద్యుల బృందం చేసిన పోస్ట్‌మార్టం నివేదికలో చిత్రహింసల కారణంగానే తీవ్రమైన రక్తస్రావమై తండ్రీకొడుకులు మృతిచెందారని తేలింది. వీరి మృతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో ఉండగా, ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. సీబీఐ అధికారులు తండ్రీకొడుకుల మృతిపై లోతైన దర్యాప్తు చేశారు. పలువురు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తండ్రీకుమారులపై పోలీసులు మోపిన అభియోగాలు కూడా అబద్ధమని తేలింది. 

మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం కీలకమైంది

తండ్రీకొడుకుల మృతి కేసులో ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. వారిని పోలీసులు రాత్రంతా చిత్రహింసలు పెట్టారని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. పోలీస్ స్టేషన్‌లోని బల్లలు, లాఠీలపై తనకు రక్తపు మరకలు కనిపించాయని వెల్లడించారు. బల్లలపై నుంచి కింద పడిన రక్తాన్ని బాధితులతోనే తుడిపించారని తెలిపారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు సీసీటీవీ ఫుటేజీని సైతం పోలీసులు తొలగించారని వాపోయారు. ‘మమ్మల్ని వదిలేయండి’ బాధితులు అని విలపించినా, పోలీసుల గుండె కరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, లాకప్ గోడలు, టాయిలెట్, ఎస్‌హెచ్‌వో గదితో పాటు పోలీస్‌స్టేషన్‌లో పలుచోట్ల సేకరించిన డీఎన్‌ఏ నమూనాలు బాధితుల డీఎన్‌ఏలతో సరిపోలాయని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది.

పోలీసులు సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలు, సీబీఐ సేకరించిన ఆధారాలు వారి నేరాన్ని నిరూపించాయి. కేసుపై న్యాయస్థానం సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపింది. ఇరుపక్షాల వైపులా 100 మందికి పైగా సాక్షులను విచారించింది. చివరకు న్యాయస్థానం తండ్రీకొడుకుల మరణానికి పోలీసులే కారణమని నిర్ధారణకు వచ్చింది. ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసుగా అభివర్ణిస్తూ తొమ్మిది మంది పోలీసులకు గరిష్ఠ శిక్షగా మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఇదే కేసులో పదో నిందితుడైన స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై విచారణ సమయంలోనే కరోనాతో మరణించారు. మదురై కోర్టు తీర్పు కేవలం శిక్ష మాత్రమే కాదని, పోలీసు వ్యవస్థలోని జవాబుదారీతనాన్ని గుర్తు చేసే ఒక హెచ్చరిక అని విశ్లేషకులు చెప్తున్నారు.

దోషులు వీరే

ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్-ఇన్ స్పెక్టర్లు పీ రఘూగణేష్, కే బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్.మురుగన్, ఎ.స మదురై, కానిస్టేబుళ్లు ఎం.ముత్తురాజ్, ఎస్.చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వే లుముత్తు ఉన్నారు. ఈ కేసులో పదో నిందితుడైన స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై కేసు విచారణ సమయంలో కోవిడ్‌తో మరణించారు.