11 March, 2026 | 11:18 AM

డబ్బుల కోసం శిశువు అమ్మకం!

11-03-2026 12:00 AM
  1. రూ.1.50 లక్షలకు బేరం
  2. తల్లిదండ్రులు సహా ఆరుగురి అరెస్ట్ 

మెదక్, మార్చి 10 (విజయక్రాంతి): మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెల రోజుల మగ శిశువును అమ్మిన ఘటన హావేలీఘనపూర్ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో శిశువు తల్లిదండ్రులు, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

హావేలీఘనపూర్ మండలం లింగసా న్‌పల్లి తండాకు చెందిన కేతావత్ మంజుల (25), మహేష్ దంపతులు. నెల క్రితం మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మం జుల మగ శిశువుకు జన్మనిచ్చింది. వారం రోజులుగా అంగన్వాడీ కేంద్రంలో లభించే అనుబంధ పోషకాహారం కోసం మంజుల రాకపోవడంతో అంగన్వాడీ టీచర్ ఆమె ఇంటి కి వెళ్లగా తాళం వేసి ఉన్నది. ఈ విషయాన్ని ఐసీడీఎస్ సెక్టార్ ఇంచార్జ్ పర్ల విజయలక్ష్మికి తెలిపారు.

విచారణ జరపగా ఈ నెల 4న మెదక్‌లోని ఒక టాకీస్ వద్ద మంజుల, మహేష్.. హావేలీఘనపూర్‌కు చెందిన కుమ్మరి నాగరాజు, అతని భార్య స్వప్నతో కలిసి శిశువును రూ.5 లక్షలకు అమ్మాలని నిర్ణయించు కుని, రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది. హావేలీఘనపూర్ మండలం శాలిపేటలో స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని శిశువును వారికి అప్పగించారు. 9న చేగుంట బస్‌స్టాప్ వద్ద మంజుల, మహేష్‌లను ఐసీడీఎస్ సెక్టార్ ఇంచార్జ్ పర్ల విజయ లక్ష్మి గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఆర్థిక ఇబ్బందులతో శిశువును అమ్మినట్లు విచారణలో తెలిపారు. మధ్యవర్తులైన కుమ్మరి నాగరాజు, స్వప్నను విచారించగా కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కంచర్లకు చెందిన వారి బంధువులు నరసొల్ల రాజు, రజితకు అప్పగించినట్లు వెల్లడైంది. ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి కంచర్ల గ్రామానికి వెళ్లి శిశువును తెచ్చి, సఖి కేంద్రంలో శిశువు తల్లి మంజులకు అప్పగించారు.