అంటార్కిటికాలో కలుస్తారట!
స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “ప్రియాంక చోప్రా ఒక క్షణం లో చాలా సున్నితంగా ఉంటూనే, మరో క్షణంలో అత్యంత శక్తిమంతంగా కనిపించగలరు. ఇలాం టి ప్రతిభ ఉన్న అతికొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు. ‘ది బ్లఫ్’ ఆమె నటనకు మరో నిదర్శనం.
ఇందులో యాక్షన్ స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి” అని కొనియాడారు. ఇక మహేశ్‌బాబు కూడా ఈ సినిమాపై తన అభిప్రాయా న్ని పంచుకున్నారు. ‘యాక్షన్ ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న చిత్రమిది. ప్రియాంక తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. టీమ్ అందరికీ అభినందనలు’ అంటూ పోస్ట్ చేశారు. ఇదిలావుం డగా, మహేశ్ చేసిన పోస్టుకు ప్రియాంక చోప్రా ఇచ్చిన రిప్లై అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’లో ప్రియాంక కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేశ్‌కు థాంక్స్ చెప్తూ ప్రియాంక.. ‘వారణాసి’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ‘థాంక్యూ మై ఫ్రెండ్.. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం’ అంటూ బదులివ్వడం.. ఈ చిన్న కామెంట్‌తో తమ సినిమా తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగబోతోందనే విషయాన్ని ప్రియాంక వెల్లడించింది. అత్యంత కఠినమైన మంచు కొండల్లో షూటింగ్ ప్లాన్ చేయడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.




