27 August, 2026 | 2:56 PM

లారీ ఢీకొని స్కూల్ కు వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి మృతి

27-08-2026 11:41 AM

బాన్సువాడ,ఆగస్టు27(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy) బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని అరాఫత్ కాలనీకి చెందిన మహమ్మద్ రఫీ తన ముగ్గురు పిల్లలను బైక్ పై ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా ఉన్న హీరా మోడల్ స్కూల్ కు తీసుకెళ్తున్నారు.

తాడ్కోల్ చౌరస్తా వద్ద సిగ్నల్ వద్ద ఆగి వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది.దీంతో బైక్ పై ఉన్న నాలుగేళ్ల చిన్నారి జైనబ్ ఫాతిమా కింద పడిపోయింది. లారీ చక్రం ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.